మార్చి 3న ప్రజల ముందుకు జేఎఫ్‌సీ నివేదిక: పవన్‌

Update: 2018-03-02 04:58 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ, ఏపీకి జరిగిన అన్యాయానికి కారణమెవరో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని కమిటీ పవన్‌కు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఇరు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని తెలిపింది. ఇవాళ మరోసారి సమావేశమై నివేదికపై JFC చర్చించనుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏపీని ముంచాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు JFC నివేదిక ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కమిటీ నివేదికలో తెలిపింది. జనసేనాని పవన్ ట్విట్టర్ ద్వారా భేటీ వివరాలను తెలియజేశారు. 

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పద్మనాభయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ అధికారి తోట చంద్రశేఖర్.. పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని పవన్‌కు కమిటి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కమిటీ నివేదికను ప్రజలకు ఎలా వివరించాలని చర్చలు జరిపారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని నివేదిక తేల్చింది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేదని జేఎఫ్‌సీ రిపోర్టులో చెప్పినట్టు సమాచారం. ఇవాళ మరోసారి సమావేశమై నివేదికపై JFC చర్చించనుంది. కమిటీ ఇచ్చిన నివేదికపై పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రేపు సాయంత్రం జనసేన ఈ నివేదికను విడుదల చేయనుంది.


 

Similar News