తీరం దాటిన దయె తుఫాను...ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Update: 2018-09-21 04:36 GMT

ఉత్తర కోస్తాంధ్రను భయపెట్టిన దయె తుఫాను తీరం దాటింది. కోస్తాంధ్రలోని కళింగపట్నం, ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్‌ పశ్చిమ వాయువ్య దిశగా 40 కిలోమీటర్లు,  భవాన్నీపట్నానికి  తూర్పు ఆగ్నేయంగా 150 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచాయి. దయె తుఫాను క్రమంగా బలహీనపడనుంది. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అయితే తుఫాను తీరం దాటినా మరో 12 గంటల పాటు మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ విభాగం అధిరులు హెచ్చరించారు. భీమిలి, విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక..మిగతా పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. దీంతో ఆ జల్లాల లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండో చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

Similar News