పెద్దాయనకు మద్దెల దరువు

Update: 2018-01-23 13:45 GMT

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మీద విమర్శలు నానాటికీ పెరుగుతున్నాయి. ఆంధ్రా మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నాడంటున్న ఏపీ బీజేపీ నాయకులు ఏపీకి ప్రత్యేకమైన గవర్నర్ ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు తెలంగాణలో అధికార పక్షానికే పూర్తిగా వంత పాడుతున్నాడంటూ టీ-కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తూండడం విశేషం. 

తెలుగు రాష్ట్రాల గవర్నర్ విమర్శల పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనన్ని రాజకీయ విమర్శలు ఈఎస్ఎల్ నరసింహన్ ఎదుర్కొంటున్నారు. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజల పక్షపాతిగా టీఆర్ఎస్ నుంచి, టీ-జాక్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న నరసింహన్ రాష్ట్ర విభజన తరువాత కొద్దికాలానికే ఏపీ నేతల నుంచి అదే తరహా వ్యాఖ్యానాలు ఎదుర్కోవడం విశేషం. ఓవరాల్ గా చూస్తే తాజాగా అసలు గవర్నర్ వ్యవస్థే అవసరం లేదన్న డిమాండ్ వినిపిస్తుండడం ఆ పదవి ఔన్నత్యాన్ని మరోసారి చర్చాంశంగా మారుస్తోంది. 

ఇక సెంటిమెంట్ల ఉధృతి తగ్గిపోయి, పాలన గాడిన పడ్డాక పార్టీలన్నీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్న సమయంలో గవర్నర్ పాలకపక్షం వహించే వ్యక్తిగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గవర్నర్ నరసింహన్  ఏపీ మీద సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని, ఏపీ ప్రజలకు గానీ, నాయకులకు గానీ ఆయన అందుబాటులో ఉండడం లేదని ఏపీ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారిక నివాసం లేకపోవడం వల్లే ఆయన ఏపీకి రావడం లేదా అన్న అనుమానాలు కూడా బీజేపీ వ్యక్తం చేస్తోంది. కనీసం ఎమ్మెల్యేలు కలవాలన్నా హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోందని, అనేక బిల్లులు కూడా గవర్నర్ పెండింగ్ లో పెడుతున్నట్టు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే ఏపీకి కొత్త గవర్నర్ ను కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

ఈ మధ్య గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు సైట్ లో పనిచేస్తున్న కూలీ దగ్గర నుంచి ఇంజినీర్ వరకు అందరినీ పలకరించి వారి వ్యక్తిగత సౌకర్యాలు, అవస్థలను కూడా అడిగి తెలుసుకున్నారు. అన్ని విషయాల్లో సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మంత్రి హరీశ్ రావును కాళేశ్వర్ రావుగా పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

అభివృద్ధి పనుల్లో భాగం అవుతున్న పాలకులను ఇంత పెద్దఎత్తున పొగడటం గవర్నర్ కు ఏం అవసరమంటూ కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఆయన పొగడ్తల వల్ల స్వయంగా గవర్నర్ కూడా ఓ రాజకీయ నాయకుడిగా మారారని వారంటున్నారు. ఎంతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గవర్నర్ తన మీద వస్తున్న విమర్శలు పరిగణనలోకి తీసుకొని స్వయంగా తప్పుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలకు అతీతమైన గవర్నర్ పాత్రను కొందరు అతిక్రమిస్తున్నారని, అటు కేంద్రం కూడా గవర్నర్లను ఎరగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోందని అందువల్ల ఆ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణ డిమాండ్ చేస్తున్నారు.

Similar News