తెలుగు ఫిమేల్ యాంకర్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అయితే సుమతో పాటు ఉదయభాను కూడా చాలామందికి సుపరిచితురాలే. పెళ్లి తర్వాత ఉదయభాను యాంకరింగ్‌కు దాదాపుగా గుడ్ బై చెప్పడంతో ఆమె పేరు ఈ మధ్య కాలంలో పెద్దగా వినిపించ లేదు. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో టీవీ షోలు మొదలైన తొలినాళ్లలోనే ఉదయ భాను బుల్లితెర యాంకరింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆమె ఎన్నో షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఉదయభాను యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆమెను అభిమానించే చాలామంది కొంత నిరాశ చెందారు. ఆమె కవల పిల్లలను తీసుకుని ఓ టీవీ చానల్ వేడుకల్లో తళుక్కున మెరవడంతో చాలామంది సంతోషం వ్యక్తం చేశారు.
ఆమెను తిరిగి బుల్లితెరపై చూడొచ్చని చాలామంది భావించారు. అయితే దాదాపు సంవత్సరం తర్వాత.. మళ్లీ యాంకరింగ్‌ను కొనసాగించాలని ఉదయ భాను నిర్ణయించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఇన్నాళ్లూ తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం యువర్ భానూ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్ చేసింది. స్టార్ మాలో త్వరలో ప్రసారం కానున్న నీతోనేడ్యాన్స్ అనే డ్యాన్స్ షోతో రీఎంట్రీ ఇస్తున్నట్లు ఖరారు చేసింది. దీంతో ఆమెను మళ్లీ బుల్లితెరపై చూడాలనుకున్న చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ షో కోసం ఎదురుచూస్తున్నారు.