Ola Electric Share Price Crash : మాకు దిక్కెవరు సామీ.. లబోదిబోమంటున్న ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్లు
మాకు దిక్కెవరు సామీ.. లబోదిబోమంటున్న ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్లు
Ola Electric Share Price Crash : షేర్ మార్కెట్ అంటేనే ఒక జూదంలా మారిపోయింది. ఒకప్పుడు ఇన్వెస్టర్ల కళ్లల్లో ఆశలు నింపిన ఓలా ఎలక్ట్రిక్ షేరు, ఇప్పుడు వారి పాలిట ఒక పీడకలలా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవం తెస్తుందని భావించిన ఈ కంపెనీ స్టాక్, ఇప్పుడు పాతాళానికి పడిపోతోంది. ఒకప్పుడు రూ. 157 వద్ద ఆల్-టైమ్ హైని తాకిన ఈ షేరు, ఇప్పుడు ఏకంగా 86 శాతం మేర నష్టపోయి రూ. 21 దగ్గర ట్రేడ్ అవుతుండటం చూస్తుంటే ఇన్వెస్టర్ల గుండె ఆగిపోతోంది. అసలు ఈ దిగ్గజ ఈవీ కంపెనీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇన్వెస్టర్ల సొమ్ము ఎలా ఆవిరైపోయిందో వివరంగా తెలుసుకుందాం.
సోమవారం ట్రేడింగ్ సెషన్ ఓలా ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి మొదలై, ఒక్కరోజే ఈ షేరు 16 శాతం మేర కుప్పకూలింది. నిన్న రూ. 25.22 వద్ద ముగిసిన షేరు, ఈరోజు రూ. 21.21 కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కోలుకుని రూ. 24 వద్ద స్థిరపడింది. ఈ భారీ పతనం తర్వాత కంపెనీ మార్కెట్ విలువ కేవలం రూ. 10,568 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది కాలంలో సెన్సెక్స్ 9 శాతం లాభాలను ఇస్తే, ఓలా షేరు మాత్రం 58 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఆగస్టు 2024లో రూ. 76 ఇష్యూ ధరతో లిస్ట్ అయిన ఈ షేరు, కేవలం కొన్ని రోజులకే రూ. 157కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు ఆ వెలుగులన్నీ ఆరిపోయి చీకట్లు అలముకున్నాయి.
కంపెనీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఇన్వెస్టర్లలో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. మూడో త్రైమాసిక ఫలితాలు ఓలా బలహీనతను బయటపెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 470 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ, నికర లోటు మాత్రం ఏకంగా రూ. 487 కోట్లుగా నమోదైంది. అంటే సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. ఇలాంటి భారీ నష్టాలు చూపిస్తున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఒకవైపు అమ్మకాలు తగ్గిపోవడం, మరోవైపు నిర్వహణ ఖర్చులు పెరగడం ఓలాకు పెద్ద తలనొప్పిగా మారింది.
తగ్గుతున్న అమ్మకాలను పెంచేందుకు ఓలా యాజమాన్యం ఓలా ఇన్సైడర్స్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త జనరేషన్ స్కూటర్లు, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లపై రూ. 50,000 వరకు డిస్కౌంట్లు, రెండో వాహనం కొంటే రూ. 20,000 అదనపు బెనిఫిట్ వంటి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. కానీ, మార్కెట్ సెంటీమెంట్ మాత్రం మారడం లేదు. కస్టమర్ల నుంచి వస్తున్న సర్వీస్ ఫిర్యాదులు, టెక్నికల్ సమస్యలు కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సరే, నాణ్యత విషయంలో రాజీ పడితే ఫలితం ఇలాగే ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఓలా తన నెట్‌వర్క్‌ను దారుణంగా కుదించుకుంటోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 4,000 షోరూమ్‌లు ఉండగా, డిసెంబర్ 2025 నాటికి ఆ సంఖ్య 700కి పడిపోయింది. తాజా రిపోర్టుల ప్రకారం మార్చి చివరి నాటికి కేవలం 550 స్టోర్లు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. స్టోర్లు మూతపడుతుండటంతో ఉద్యోగుల తొలగింపు కూడా భారీగా జరుగుతోంది. విక్రయాలు లేక, షోరూమ్‌ల అద్దెలు కట్టలేక ఓలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ ప్రయాణం ఇప్పుడు అతిపెద్ద మలుపులో ఉంది.. అది గమ్యం వైపా లేక పతనం వైపా అనేది వేచి చూడాలి.