Gold Price Today : యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశానికి బంగారం ధరలు.. కొనాలంటే వణకాల్సిందే

యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశానికి బంగారం ధరలు.. కొనాలంటే వణకాల్సిందే

Update: 2026-03-02 01:38 GMT

Gold Price Today : పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్ అగ్రనేత ఖమేనీ హతం తర్వాత ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ఉధృతం చేయడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారత్‌లో కొనుగోలుదారులు ఈ రేట్లు చూసి కంగుతింటున్నారు. సోమవారం (మార్చి 2, 2026) నాడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాలను తాకాయి.

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,73,090 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగినప్పటికీ, గత కొన్ని రోజులుగా పెరుగుతున్న తీరు చూస్తుంటే లక్షన్నర దాటి ఏకంగా రెండు లక్షల దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,58,660కి చేరింది. ఆదివారం ఈ ధర రూ.1,58,650 వద్ద ఉండగా, నేడు మరింత ప్రియమైంది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,240 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,58,810 వద్ద కొనసాగుతోంది. చెన్నై మార్కెట్‌లో మాత్రం ఇతర నగరాల కంటే ధరలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా పెరుగుదల ఆగలేదు. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,72,100 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,57,760 వద్ద ఉంది. ఇక సిలికాన్ సిటీ బెంగళూరులో హైదరాబాద్ రేట్లతో సమానంగా 24 క్యారెట్ల బంగారం రూ.1,73,090 వద్ద స్థిరపడింది.

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర నేడు రూ.3,25,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగింది. అయితే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో వెండి ధర కొంత తక్కువగా ఉంది. అక్కడ కేజీ వెండి రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే తప్ప ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటివరకు సామాన్యులు బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News