Gold Rate Today : హమ్మయ్యా తగ్గాయి.. పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే
హమ్మయ్యా తగ్గాయి.. పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే
Gold Rate Today : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త అందింది. గత వారం రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ స్వల్పంగా పుంజుకోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు నేడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తులంపై సుమారు రూ.650 నుంచి రూ.870 వరకు దిగివచ్చాయి.
హైదరాబాద్ మార్కెట్ వివరాలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం ధర నేడు రూ.1,61,020 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ. 870 వరకు తగ్గడం గమనార్హం. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,600 కు చేరింది (రూ.800 తగ్గింది). ఇక తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,770 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధర మాత్రం కిలో రూ.2.95 లక్షల వద్ద ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. వెండి రేటు ప్రస్తుతం తులం రూ.295 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వల్ల ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉండటంతో, ఇదే కొనుగోలుకు సరైన సమయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.73 శాతం పడిపోయాయి. వెండి విషయంలోనైతే ఏకంగా 3.21 శాతం (రూ. 8,616) మేర భారీ పతనం నమోదు కావడం విశేషం. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 5,185 డాలర్ల వద్ద, వెండి ధర 88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చే విషయమే.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగితే ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరలు ఏ క్షణమైనా మళ్ళీ పెరగవచ్చు. కాబట్టి పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికి మాత్రం పసిడి పరుగుకు బ్రేక్ పడటం పసిడి ప్రేమికులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.