Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో 'బ్లాక్ ట్యూస్డే'.. ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు ఆవిరి! మార్కెట్‌ను ముంచేసినవి ఇవే!

గ్లోబల్ టెన్షన్స్, భారీ సేలింగ్ ప్రెషర్, ఐటీ-బ్యాంకింగ్ షేర్ల పతనంతో దలాల్ స్ట్రీట్‌లో ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు ఆవిరై పెట్టుబడిదారులకు భారీ షాక్!

Update: 2026-02-24 11:44 GMT

Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో 'బ్లాక్ ట్యూస్డే'.. ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు ఆవిరి! మార్కెట్‌ను ముంచేసినవి ఇవే!

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల గుండెల్లో మంగళవారం గుబులు పుట్టింది. కేవలం ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు ఆవిరి అయ్యింది. మంగళవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో దలాల్ స్ట్రీట్ దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ తీసింది. అసలు మార్కెట్ ఎందుకు పడిపోయింది, ఇన్వెస్టర్ల సొమ్మును ముంచేసిన ఆ 'ఐదుగురు విలన్లు' ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. ట్రంప్ సుంకాల భయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామన్న హెచ్చరికలు మార్కెట్‌ను భయపెట్టాయి. ముఖ్యంగా ఈరోజు ఆయన చేయబోయే 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారోనని ప్రపంచ దేశాలన్నీ ఆందోళనగా ఉన్నాయి. ఈ 'టారిఫ్ డ్రామా' వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుందనే భయం మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

2. కుప్పకూలిన ఐటీ షేర్లు

ఈరోజు మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పడిపోయింది. దీనికి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అని వెల్లడించారు. 'క్లౌడ్ కోడ్' వంటి AI సాధనాలు పాత ప్రోగ్రామింగ్ భాషలను ఆధునీకరిస్తుండటంతో, ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఐటీ షేర్లను విపరీతంగా అమ్మేశారు.

3. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్లు, అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్‌ను పెంచాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతుందేమోనన్న భయాందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 26న జరిగే అణు చర్చలు ఎలా ఉంటాయోనని ఇన్వెస్టర్లు వెయిట్ చేస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

4. పెరిగిన ముడి చమురు ధరలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు 1 శాతం పెరిగి, బ్యారెల్‌కు $72 మార్కును దాటాయి. భారత్ తన చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇది మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు.

5. బలపడుతున్న డాలర్

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరుగుతోంది. డాలర్ బలపడితే భారతదేశం వంటి దేశాల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మన రూపాయి విలువ తగ్గడంతో పాటు స్టాక్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనం (82,225.92 వద్ద ముగింపు) అయ్యింది. అలాగే నిఫ్టీ 288 పాయింట్లు పతనం (25,424.65 వద్ద ముగింపు) అయ్యింది. మొత్తంగా చూస్తే కేవలం ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు మూటగట్టుకున్న నష్టం విలువ రూ. 3 లక్షల కోట్లు అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News