Google Pay Pocket Money: బ్యాంకు ఖాతా లేకపోయినా యూపీఐ చెల్లింపులు.. గూగుల్ పే 'పాకెట్ మనీ' గురించి తెలుసా?
Google Pay Pocket Money: బ్యాంక్ ఖాతా లేకపోయిన యూపీఐ చెల్లింపులు చేయవచ్చని మీకు తెలుసా? గూగుల్ సరికత్త ఫీచర్ తో ఇది సాధ్యమే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Google pay
Google Pay Pocket Money: భారతదేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా గూగుల్ పే ప్రవేశపెట్టిన 'పాకెట్ మనీ' ఫీచర్ ద్వారా బ్యాంకు ఖాతా లేని వారు కూడా సులభంగా నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, విద్యార్థులకు ఈ సరికొత్త సాంకేతికత ఒక గొప్ప వరంగా మారనుంది.
గూగుల్ పే పాకెట్ మనీ లేదా యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన 'యూపీఐ సర్కిల్' విధానం ఆధారంగా గూగుల్ పే ఈ సేవలను అందిస్తోంది. ఇందులో ప్రైమరీ యూజర్ తన బ్యాంకు ఖాతాను మరొక వ్యక్తి (సెకండరీ యూజర్) వాడేందుకు అనుమతి ఇస్తారు. దీనివల్ల ద్వితీయ వినియోగదారుడికి సొంతంగా బ్యాంకు ఖాతా లేకపోయినా, ప్రధాన వినియోగదారుడి అనుమతితో చెల్లింపులు చేయవచ్చు.
ఎవరెవరు దీనిని ఉపయోగించవచ్చు?
ప్రైమరీ యూజర్: గూగుల్ పేలో యాక్టివ్ బ్యాంకు ఖాతా కలిగి ఉండి, ఇతరులకు నగదు ఖర్చు చేసే అధికారం ఇచ్చే వ్యక్తి.
సెకండరీ యూజర్: బ్యాంకు ఖాతా లేని పిల్లలు, తల్లిదండ్రులు లేదా స్నేహితులు. ఒక ప్రధాన వినియోగదారుడు గరిష్టంగా ఐదుగురు సెకండరీ యూజర్లను చేర్చుకోవచ్చు.
చెల్లింపుల పరిమితి, నియంత్రణ..
ఈ ఫీచర్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన వినియోగదారుడు రెండు రకాలుగా నియంత్రణ చేయవచ్చు:
నెలవారీ పరిమితి: సెకండరీ యూజర్ కోసం గరిష్టంగా నెలకు 15,000 రూపాయల వరకు పరిమితిని నిర్ణయించవచ్చు. ఈ పరిమితి లోపు వారు ప్రతిసారీ అనుమతి అడగకుండానే చెల్లింపులు చేయవచ్చు.
ప్రతి లావాదేవీకి అనుమతి: ఒకవేళ పరిమితి విధించకపోతే, సెకండరీ యూజర్ చేసే ప్రతి చెల్లింపుకూ ప్రధాన వినియోగదారుడి ఫోన్‌కు రిక్వెస్ట్ వస్తుంది. పిన్ (PIN) నమోదు చేసిన తర్వాతే లావాదేవీ పూర్తవుతుంది.
ఖాతాను ఎలా ప్రారంభించాలి?
ముందుగా గూగుల్ పే యాప్‌లో ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి 'యూపీఐ సర్కిల్' ఎంచుకోవాలి.
సెకండరీ యూజర్‌ను ఎంపిక చేసుకుని, వారి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
నెలవారీ పరిమితి లేదా ప్రతి లావాదేవీకి అనుమతి అనే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
సెకండరీ యూజర్ వివరాలు, వారి ఆధార్ సంఖ్య వంటి సమాచారాన్ని నమోదు చేయాలి.
మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఆహ్వానాన్ని పంపాలి.
కేవైసీ, భద్రత..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెకండరీ యూజర్ వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. భవిష్యత్తులో ఏదైనా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, లావాదేవీలను పర్యవేక్షించేందుకు బ్యాంకు ఈ వివరాలను సేకరిస్తుంది. దీనివల్ల నగదు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు.