Post Office: సేవింగ్స్‌తో పాటు ఇన్సూరెన్స్ కూడా.. పోస్టాఫీస్‌లో సూప‌ర్ స్కీమ్

Post Office: సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చాలా మంది ప్ర‌భుత్వ ప‌థ‌కాల వైపు అట్రాక్ట్ అవుతున్నారు.

Update: 2026-04-08 09:59 GMT

Post Office

Post Office: సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చాలా మంది ప్ర‌భుత్వ ప‌థ‌కాల వైపు అట్రాక్ట్ అవుతున్నారు. డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించే స్కీమ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి ప‌థ‌కాల్లో పోస్టాఫీస్ అందిస్తున్న “గ్రామ ప్రియ” పథకం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

గ్రామీణ కుటుంబాల కోసం రూపొందించిన ప్రత్యేక పథకం

పోస్టాఫీస్ గ్రామ ప్రియ పథకం రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) కింద వచ్చే ఒక ఇన్సూరెన్స్ ఆధారిత సేవింగ్స్ పథకం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు భద్రమైన బీమా సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మార్కెట్‌ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా భావిస్తున్నారు.

పాలసీ వ్యవధి, పెట్టుబడి పరిమితులు

ఈ పథకం కాలవ్యవధి 10 సంవత్సరాలు. ఈ కాలంలో పాలసీదారుడికి పూర్తి బీమా రక్షణ లభిస్తుంది. కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.10,000కాగా గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలుగా నిర్ణ‌యించారు. పాలసీ తీసుకునే సమయంలో నామినేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. అంటే పాలసీదారుడికి ఏదైనా జరిగితే ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకోవచ్చు.

నెలసరి ప్రీమియం ఎంత ఉంటుంది?

పాలసీ మొత్తం ఎంత తీసుకుంటారన్న దానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకుంటే, నెలకు సుమారు రూ.5,000 పైగా ప్రీమియం చెల్లించాలి. ఈ మొత్తాన్ని 10 సంవత్సరాల పాటు క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రీమియం రూ.5,042 నుంచి రూ.5,068 మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం

ఈ పథకంలో బీమా మొత్తంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌కు సంవత్సరానికి రూ.45 బోనస్ ల‌భిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే సంవత్సరానికి రూ.22,500 బోనస్ వస్తుంది. 10 సంవత్సరాల కాలానికి మొత్తం బోనస్ రూ.2.25 లక్షలు అవుతుంది. చివరగా మెచ్యూరిటీ సమయంలో

సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, బోనస్ రూ.2.25 లక్షలు అవుతుంది. మొత్తం కలిపి దాదాపు రూ.7.25 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

కుటుంబానికి ఆర్థిక భద్రత

ఈ పథకంలో ప్రధాన ప్రయోజనం లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ. పాలసీ అమల్లో ఉన్న 10 సంవత్సరాల కాలంలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే, పూర్తి సమ్ అష్యూర్డ్‌ను నామినీకి చెల్లిస్తారు. దీంతో కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయం అందుతుంది. అందుకే ఈ పథకాన్ని సేవింగ్స్‌తో పాటు రక్షణ కలిగించే పథకంగా చాలా మంది ఎంపిక చేస్తున్నారు.

గమనిక: పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీస్ అధికారులను సంప్రదించి తాజా నిబంధనలు, ప్రీమియం వివరాలు తెలుసుకోవడం మంచిది.

Tags:    

Similar News