Gold Price Today : పెళ్ళిళ్ల సీజన్ లో చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్క రోజే ఎంత పెరిగిందో తెలుసా ?

పెళ్ళిళ్ల సీజన్ లో చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్క రోజే ఎంత పెరిగిందో తెలుసా ?

Update: 2026-02-24 01:49 GMT

Gold Price Today : పసిడి ప్రేమికులకు మళ్ళీ షాకింగ్ న్యూస్.. మొన్నటి వరకు కాస్త శాంతించిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్ళీ ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. అసలు తగ్గేదేలే అన్నట్లుగా పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో తులం బంగారం ధర ఏకంగా రూ.2 లక్షల వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత మేర తగ్గుముఖం పట్టినా, ఇప్పుడు మళ్ళీ అదే జోరును అందుకున్నాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర రూ.2 వేలకు పైగా పెరగడం విశేషం. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. ఒకానొక దశలో కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరగా, ఆ తర్వాత లక్ష రూపాయల వరకు తగ్గింది. కానీ గత రెండు రోజులుగా మళ్ళీ భారీగా పెరుగుతూ, నిన్న ఒక్క రోజే ఏకంగా రూ.25 వేల మేర ఎగబాకి కిలో వెండి రూ.3 లక్షల మార్కును మళ్ళీ దాటేసింది.

తాజాగా నేడు అంటే ఫిబ్రవరి 24వ తేదీన ధరల వివరాలు చూస్తే.. దేశవ్యాప్తంగా పసిడి మార్కెట్ గందరగోళంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,360 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,910 కు చేరింది. ఇక వెండి ప్రియులకైతే ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర మళ్ళీ రూ.3,00,100 వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల సామాన్యుల జేబులకు చిల్లు పెడుతోంది. అసలు ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలియక కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల పరిస్థితి ఇలా ఉంది. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,61,360 గా ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కొంచెం ఎక్కువగా రూ.1,61,510 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో అందరికంటే ఎక్కువగా రూ.1,62,120 వద్ద పసిడి ధరలు ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ కిలో వెండి రూ.3 లక్షలకు పైగానే ఉంది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News