8th Pay Commission : జనవరి 1, 2026 నుంచే కొత్త జీతాలు? మినిమం సాలరీ రూ.54 వేలకు పెంచాలని ఉద్యోగుల డిమాండ్
జనవరి 1, 2026 నుంచే కొత్త జీతాలు? మినిమం సాలరీ రూ.54 వేలకు పెంచాలని ఉద్యోగుల డిమాండ్
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. 2026 ప్రారంభం నుంచి ఈ ప్రక్రియలో కీలకమైన అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల సవరణపై ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే 8వ పే కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే కాకుండా, ఉద్యోగుల అభిప్రాయాల కోసం ప్రత్యేక ప్రశ్నావళిని కూడా విడుదల చేసింది. జనవరి 1, 2026 నుంచి ఈ కొత్త వేతన సవరణ అమలులోకి వచ్చే అవకాశం ఉండటంతో కోట్లాది మంది ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అయిన జేసీఎం, 8వ పే కమిషన్‌కు సమర్పించాల్సిన ఉమ్మడి వినతి పత్రాన్ని సిద్ధం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధానంగా కనీస వేతనాన్ని రూ.54,000 కు పెంచాలని (ప్రస్తుతం ఇది రూ.18,000 ఉంది), అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.00కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వార్షిక వేతన పెంపును 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కూడా కోరుతున్నారు. అంతేకాకుండా, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, గ్రామీణ డాక్ సేవక్ లను కూడా ఈ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ 8వ పే కమిషన్ సెక్రటేరియట్‌లో కీలక నియామకాలు చేపట్టింది. ఐఆర్ఏఎస్ అధికారి శ్రీ కృష్ణ వి.ఆర్.ను డైరెక్టర్‌గా నియమించడంతో పాటు, ఢిల్లీలోని జన్ పథ్ వద్ద ఉన్న చంద్రలోక్ బిల్డింగ్‌లో కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, రాజ్యసభలో ప్రభుత్వం స్పందిస్తూ.. 8వ పే కమిషన్ తన నివేదికను 18 నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పెన్షనర్ల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చింది.
ప్రస్తుతం 8వ పే కమిషన్ తన అధికారిక పోర్టల్ 8cpc.gov.in ద్వారా MyGov వేదికగా 18 ప్రశ్నలతో కూడిన సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలు మార్చి 16, 2026 లోపు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. కేవలం ఆన్‌లైన్ ద్వారా వచ్చే విజ్ఞప్తులను మాత్రమే కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. కేంద్ర బడ్జెట్, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కమిషన్ తన తుది సిఫార్సులను 2027 మే నాటికి ప్రభుత్వానికి అందజేయనుంది.