Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో ప్రళయం.. ఒక్కసారిగా 6500 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దలాల్ స్ట్రీట్‌లో ప్రళయం.. ఒక్కసారిగా 6500 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
Stock Market Crash : భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన బ్లాక్ మండేని ఇన్వెస్టర్లు చూస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి దలాల్ స్ట్రీట్‌ను కుదిపేస్తోంది. నేడు (మార్చి 2, సోమవారం) ప్రీ-మార్కెట్ సెషన్ ప్రారంభం కావడమే పెను విధ్వంసంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 6500 పాయింట్లకు పైగా కుప్పకూలి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నిఫ్టీ కూడా అదే బాటలో భారీ పతనాన్ని నమోదు చేస్తూ ట్రేడింగ్ అవుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలు మన మార్కెట్లపై పెను ప్రభావం చూపుతున్నాయి.
గత వారం శుక్రవారం (ఫిబ్రవరి 27) నాటి ట్రేడింగ్ కూడా ఏమంత ఆశాజనకంగా సాగలేదు. ఆ రోజే మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 961.42 పాయింట్లు (1.17%) నష్టపోయి 81,287 వద్ద ముగియగా, నిఫ్టీ 317.90 పాయింట్లు (1.25%) పడిపోయి 25,178 స్థాయికి చేరుకుంది. ఆ రోజు ఎయిర్‌టెల్, మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి దిగ్గజ షేర్లు భారీగా నష్టపోయాయి. కేవలం ఐటీ రంగం మాత్రమే స్వల్పంగా నిలదొక్కుకుంది. అయితే, సోమవారం నాటి పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఇన్వెస్టర్ల సంపదను క్షణాల్లో ఆవిరి చేస్తున్నాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని గమనిస్తే.. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు కుదేలయ్యాయి. నిఫ్టీ 100, నిఫ్టీ బ్యాంక్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయం మార్కెట్లను కుదిపేస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లడంతో మార్కెట్లు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుందో తెలియక ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితిపై ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ.. యుద్ధం ముగిసే వరకు లేదా శాంతి చర్చల సంకేతాలు వచ్చే వరకు మార్కెట్లలో ఇలాంటి అస్థిరత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు చేయవద్దని, ప్రస్తుతానికి వేచి చూడటమే ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా చమురు ధరలపై ఆధారపడే కంపెనీల షేర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ ఈ స్థాయి పతనాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. రాబోయే గంటల్లో ట్రేడింగ్ ఎలా సాగుతుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.