LPG Price Hike 2026: హోలీ వేళ సామాన్యుడికి షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. విమాన ప్రయాణం కూడా భారమే!
LPG Price Hike 2026: హోలీ పండుగ సంబరాల్లో ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను సవరించాయి.
LPG Price Hike 2026: హోలీ వేళ సామాన్యుడికి షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. విమాన ప్రయాణం కూడా భారమే!
LPG Price Hike 2026: హోలీ పండుగ సంబరాల్లో ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను సవరించాయి. ఈసారి వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచడంతో పాటు, విమాన ఇంధనం (ATF) ధరలను కూడా భారీగా పెంచడం గమనార్హం. వ్యాపార అవసరాల కోసం వాడే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ.31 వరకు పెంచారు. పండుగ సీజన్‌లో స్వీట్లు, పిండివంటల తయారీ పెరిగే తరుణంలో ఈ పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులపై భారాన్ని పెంచనుంది. దీంతో బయట దొరికే ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో కొత్త ధరలు (19 కేజీల సిలిండర్):
కోల్‌కతా: రూ.1875.50 (గతంలో రూ.1844.50)
ఢిల్లీ: రూ.1768.50 (గతంలో రూ.1740.50)
ముంబై: రూ.1720.00 (గతంలో రూ.1692.00)
చెన్నై: రూ.1929.00 (గతంలో రూ.1899.50)
వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ, ఇంట్లో వాడే 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం ఊరటనిచ్చే అంశం. ఢిల్లీలో దీని ధర రూ.853 వద్ద స్థిరంగా ఉండగా, భాగ్యనగరంలోనూ పాత ధరలే కొనసాగుతున్నాయి. పాట్నాలో అత్యధికంగా రూ.951 వద్ద గృహ సిలిండర్ లభిస్తోంది.
విమాన టికెట్ల ధరలు పెరిగే ఛాన్స్!
విమానాల్లో వాడే ఇంధనం (ATF) ధరలు మార్చి 1 నుంచి భారీగా పెరిగాయి. ఢిల్లీలో 1000 లీటర్ల ఏటీఎఫ్ ధర రూ.91,393 నుంచి ఏకంగా రూ.96,638కి చేరింది. సుమారు రూ.5,000 పైగా పెరగడంతో విమానయాన సంస్థలు ఆ భారాన్ని ప్రయాణికులపై మోపే అవకాశం ఉంది. వేసవి సెలవులు, పండుగ ప్రయాణాల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. పండుగ పూట సామాన్యుడి వంటగదికి ఇబ్బంది లేకపోయినా, బయట దొరికే తిండి, ప్రయాణ ఖర్చుల రూపంలో మధ్యతరగతి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.