Gold Price: సామాన్యులకు షాక్.. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు..!
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. కొనాలంటే భారమే, పెట్టుబడిదారులకు మాత్రం లాభాల జోరు!
Gold Price: సామాన్యులకు షాక్.. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు..!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణం అమెరికా - ఇజ్రాయెల్ దాడుల వార్తలతో మార్కెట్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తుండటంతో వీటి ధరలు సరికొత్త రికార్డులను తాకాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండగా, బంగారం మాత్రం ఇన్వెస్టర్లకు అండగా నిలుస్తోంది. సోమవారం MCX మార్కెట్‌లో కేవలం ఒక్క రోజే 3.5% పెరుగుదల నమోదైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యుద్ధం ముదరితే త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షల మార్కును చేరుకోవచ్చని చెబుతున్నారు.
వెండిలోనూ అదే జోరు..
కేవలం బంగారం మాత్రమే కాదు, పారిశ్రామికంగా, పెట్టుబడిగా వెండి కూడా దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా వెండి $100 మార్కును చేరుకోవచ్చనే వార్తలు వెండి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,490 వద్ద ట్రేడవుతోంది. ఒకవైపు ఇన్వెస్టర్లు లాభపడుతున్నా, పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఈ వార్త పిడుగులాంటిదే. వరుసగా ఏడు నెలలుగా పెరుగుతూ వస్తున్న ధరలు, 1973 తర్వాత అత్యంత సుదీర్ఘమైన ర్యాలీగా రికార్డు సృష్టించాయి.
గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడికి ఆయుధాలుగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, బంగారం ధర సామాన్యుడి అంచనాలకు అందనంత ఎత్తుకు వెళ్లడం ఖాయం అని చెబుతున్నారు.