Gold Price Crash : పసిడి ప్రేమికులకు పండగే పండగ..ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన బంగారం ధరలు

పసిడి ప్రేమికులకు పండగే పండగ..ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన బంగారం ధరలు

Update: 2026-02-14 00:59 GMT

 Gold Price Crash : బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. భారతీయ మహిళలకు అదొక సెంటిమెంట్, ఒక భరోసా. అందుకే ధర ఎంత పెరిగినా పసిడిపై మనవాళ్లకు మక్కువ తగ్గదు. అయితే గత కొన్ని రోజులుగా చుక్కలను తాకిన పసిడి ధరలు, ఇప్పుడు సామాన్యులకు కాస్త ఊరటనిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్నటితో పోలిస్తే నేడు ఫిబ్రవరి 14, శనివారం నాడు మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే బంగారంపై రూ.2 వేలకు పైగా, వెండిపై ఏకంగా రూ.15 వేల వరకు కోత పడటం విశేషం.

ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర రూ.1,55,770 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,790 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే ఇది దాదాపు 1.5 శాతం వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం వంటి కారణాల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి కూడా నేడు నేల చూపులు చూస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.15,000 వరకు తగ్గడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ట్రేడ్ అవుతోంది. పారిశ్రామిక అవసరాలకు డిమాండ్ కాస్త తగ్గడం, లాభాల స్వీకరణ దిశగా ఇన్వెస్టర్లు అడుగులు వేయడం వల్లే వెండి ధరలు ఇలా కుప్పకూలినట్లు తెలుస్తోంది. వెండి వస్తువులు లేదా ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.

నగరాల వారీగా పసిడి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,920గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,940 వద్ద ఉంది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో కూడా ధరలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,55,770గా, 22 క్యారెట్ల ధర రూ.1,42,790గా నమోదైంది. చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,080గా ఉండటం గమనార్హం.

మహిళలు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇక్కడ పేర్కొన్న ధరలు కేవలం మార్కెట్ రేట్లు మాత్రమే. వీటిపై అదనంగా 3 శాతం జీఎస్టీ (GST), హాల్‌మార్కింగ్ ఛార్జీలు మరియు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు వంటివి ఉంటాయి. కాబట్టి మీరు కొనే జువెలరీ షాపులో ఫైనల్ రేటు కొంత అటు ఇటుగా మారవచ్చు. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోయిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గడంతో షోరూమ్‌లు కస్టమర్లతో సందడిగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News