వల్లభనేని వంశీ, పోసాని అరెస్ట్… రేపెవరు? రెడ్ బుక్‌ ఏం చెబుతోంది?

Update: 2025-03-02 01:30 GMT

AP Politics: వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్… రేపెవరు? రెడ్ బుక్‌ ఏం చెబుతోంది?

మొన్న వల్లభనేని వంశీ... నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్.. రేపు ఎవరనే చర్చ ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో జరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకున్న ఫ్యాన్ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు సర్కార్ పై జగన్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని సైకిల్ పార్టీ కౌంటరిస్తోంది.

ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? చంద్రబాబు సర్కార్ ఏం చెబుతోంది? అసలు వడ్డీతో కలిపి వసూలు చేస్తామని అప్పట్లో పసుపు పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఈ అరెస్టులు అద్దం పడుతున్నాయా? ఏపీలో అసలు ఏం జరుగుతోందో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

Full View

వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. ఇదే సమయంలో వల్లభనేని వంశీపై నమోదైన కేసులను పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు.

ఇక సినీ నటుడు మాజీ ఏపీ‌ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా సొంబేపల్లి పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు మేజిస్ట్రేట్ ఈ ఏడాది మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీ నాయకులు, శ్రేణులపై కేసుల విషయంలో తాత్సారం చేస్తున్నారనే టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉండింది.

ఈ విషయమై సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వంపై తమ అక్కసును వెళ్ళగక్కారు. అయితే కక్షసాధింపు కాకుండా చట్టప్రకారంగానే వ్యవహరిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వంశీ, పోసాని అరెస్టుల విషయంలో రాజకీయ కక్షసాధింపు లేదని చట్ట ప్రకారమే వ్యవహరించామని సైకిల్ పార్టీ చెబుతోంది.

వైఎస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు

అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను 2024 ఆగస్టులో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని, దేవినేని అవినాశ్ పై కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని 2024 అక్టోబర్ 17న పోలీసులు విచారించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేశ్ పై మరో కేసు నమోదైంది. ఈ కేసులో జోగి రమేశ్ ను పోలీసులు గత ఏడాది చివర్లో విచారించారు. ఇదే కేసులో అవినాశ్, జోగి రమేశ్ కు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 25న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. .

పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ , విశాఖపట్టణం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదయ్యాయి. ఇక సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్, రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి.

వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇక సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లా స్టూడెంట్ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై 2024 డిసెంబర్ 31న కేసు నమోదైంది. నానితో పాటు ఆయన భార్య జయసుధపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే తమపై కేసులు నమోదు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అంతా రెడ్ బుక్‌లో ఉన్నట్లే జరుగుతోందా?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకొన్నారని అప్పట్లో ఈ రెండు పార్టీలు ఆరోపించాయి. అప్పట్లో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చంద్రబాబులను వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. టీడీపీ, జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమంగా కేసులు నమోదు చేసే పోలీసులు, తప్పుడు ఫిర్యాదులు చేసే నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని లోకేశ్ ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు నమోదు కావడాన్ని ఫ్యాన్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తోంది.

అయితే ఈ ఆరోపణలను సైకిల్ పార్టీ కొట్టిపారేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాము ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు విచారణను ప్రారంభించారని అధికార పార్టీ చెబుతోంది. చట్టప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడినందునే కేసులు నమోదయ్యాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని సైకిల్ పార్టీ చెబుతోంది.

నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది?

ఇక నెక్స్ట్ అరెస్టు అయ్యేది ఎవరనే చర్చ ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో మొదలైంది. అధికార పార్టీ అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కేసులు పెడితే మహా అయితే మూడు నెలలు జైల్లో ఉంటాం.. ఆ తర్వాత బయటకు వస్తాం... జైలు నుంచి బయటకు వచ్చి నేను సీఎం కాలేదా అంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని స్ధబ్దుగా ఉంటున్నారు. ఈ సమయంలో నెక్స్ట్ అరెస్టయ్యేది కొడాలి నాని, పేర్ని నాని, రోజా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మైండ్ గేమ్ లో భాగంగా ఈ ప్రచారం సాగుతోందా.. ఇందులో వాస్తవం ఉందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చట్ట ప్రకారంగానే తాము వ్యవహరిస్తామని ఇందులో రాజకీయ దురుద్దేశాలు లేవని అధికార పార్టీ చెబుతోంది. అదే సమయంలో తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదని సైకిల్ పార్టీ నాయకులు అంటున్నారు.

గతంలో ఈ తరహా రాజకీయాలు తమిళనాడుకు పరిమితమయ్యాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు తరహా రాజకీయాలు ప్రారంభమయ్యాయనే చర్చ కూడా ఉంది. రానున్న రోజుల్లో ఇవి ఎటువైపునకు దారి తీస్తాయో చూడాలి.

Also watch this video: AP Budget 2025: సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులెంత? | Super Six Schemes

Full View

Also watch this video: SLBC Tunnel Incident: SLBC టన్నెల్ లో ప్రమాదం.. అసలు ఏం జరిగింది?

Full View

Also watch this video: Maha kumbh Mela: మహా కుంభమేళా కోసం పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఆదాయం ఎంత?

Full View

Tags:    

Similar News