Davos WEF 2026: పెట్టుబడులు రావాలి.. సంపద పెరగాలి..దావోస్‌కి వెళ్తున్న ఏపీ, తెలంగాణ సీఎంలు..!!

Davos WEF 2026: పెట్టుబడులు రావాలి.. సంపద పెరగాలి..దావోస్‌కి వెళ్తున్న ఏపీ, తెలంగాణ సీఎంలు..!!

Update: 2026-01-18 00:42 GMT

Davos WEF 2026: ఫ్యూచర్ సిటీ వంటి మహత్తర ప్రణాళికలతో తెలంగాణ, “స్పీడ్ ఆఫ్ డూయింగ్” విధానంతో ఆంధ్రప్రదేశ్‌… రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో వేగం పెంచాయి. అయితే పెట్టుబడిదారుల దృష్టిలో తెలంగాణకు కొన్ని స్పష్టమైన ఆధిక్యతలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం తెలంగాణకు ప్రధాన బలంగా మారింది. ఆధునిక మౌలిక సదుపాయాలు, సానుకూల వాతావరణం, జీవన ప్రమాణాలు… ఇవన్నీ కలిసి గ్లోబల్‌ కంపెనీలను సహజంగానే ఆకర్షిస్తున్నాయి. అందుకే బహుళజాతి సంస్థలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం స్టీల్ సిటీగా, ప్రధాన నగరంగా ఉన్నప్పటికీ… హైదరాబాద్‌ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి ఇంకా చేరుకోలేదనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. పాలనలో వేగం, అనుమతుల మంజూరులో సరళత, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం వంటి అంశాలతో ఏపీ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలి నివేదికల ప్రకారం దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే జనవరి 18న సీఎం చంద్రబాబు నాయుడు, 19న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొననున్నారు.

దావోస్‌ పర్యటనలో సీఎం చంద్రబాబు నాలుగు రోజులపాటు అక్కడే ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, అనుమతులు ఎంత వేగంగా ఇస్తున్నారో… అన్న విషయాలను వివరించనున్నారు. గతేడాది ఇదే సదస్సులో జరిపిన చర్చల ద్వారా గణనీయమైన పెట్టుబడులు రాబట్టిన ప్రభుత్వం, ఈసారి మరింత భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి ప్రపంచ ప్రముఖ సంస్థల సీఈఓలతో చంద్రబాబు నాయుడికి ఇప్పటికే పరిచయాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు ఆయన వారితో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. అందువల్ల ఏపీలో పెట్టుబడుల విషయంలో ఆయా కంపెనీల అధినేతలు ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో పాటు గూగుల్ క్లౌడ్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై కీలక ముందడుగులు పడే అవకాశముంది.

పర్యటన షెడ్యూల్‌ను పరిశీలిస్తే… సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి 8.35 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి అర్ధరాత్రి 1.45కి విమానంలో బయల్దేరి 19వ తేదీ ఉదయం జ్యురిచ్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ హిల్టన్‌ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కిషోర్‌ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో సమావేశం ఉంటుంది. అదే రోజు హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్తారు.

దావోస్‌లో 19వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సమావేశం ఉంది. ఈ భేటీలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా పాల్గొంటారు. అదేవిధంగా సీఐఐ డైరెక్టర్ జనరల్‌ చంద్రజిత్ బెనర్జీతోనూ చర్చలు జరగనున్నాయి. అనంతరం ప్రముఖ విదేశీ మీడియా సంస్థ ‘పోలిటికో’కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

ఈ సమావేశాల సందర్భంగా పలు అవగాహనా ఒప్పందాలు (MoUలు) కుదిరే అవకాశం ఉంది. అయితే వాటిని కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవ పెట్టుబడులుగా మార్చడమే అసలైన సవాలుగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కేవలం MoUలకే పరిమితం కాకుండా… నేరుగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. స్థలం ఎంపిక నుంచి ప్రాజెక్టు ప్రారంభం వరకు వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానం కంపెనీలకు బాగా నచ్చుతోందని అధికారులు చెబుతున్నారు. భారీ ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు వేగవంతమైన పాలన కారణంగా ఈసారి దావోస్‌ సదస్సుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది

Tags:    

Similar News