కర్నూలులో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

Kurnool: కేటుగాళ్లకు వనరుగా మారిన రేషన్ బియ్యం

Update: 2022-04-29 12:51 GMT

కర్నూలులో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

Kurnool: అవి పేదల ఆకలి తీర్చే బియ్యం కానీ అక్రమార్కులకు కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అడ్డదారులో వ్యాపారం చేసే కేటుగాళ్లకు వనరుగా మారింది. పేదల బియ్యం రాష్ట్ర ఎల్లలు దాటిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో రేషన్ బియ్యం తరలింపు ఓ తంతుగా మారింది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న రీతిలో నంద్యాలో జోరుగా సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

ప్రజా సంక్షేమ పధకాలు పక్కదారి పడుతున్నాయి. పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం ఓ మాఫియాగా మారింది. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం నేరుగా ఇంటికే బియ్యం తరలిస్తూ మార్పులు చేసినా ఈ అక్రమ రవాణా ఆగటం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జిల్లాలో కొందరికి ఓ ఉపాధిగా మారింది. ఈ దందాతో కొందరు కోట్లు గడిస్తున్నారు.

డోన్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా భారీ ఎత్తున సాగుతోంది. రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సీఎం జగన్ వేల కోట్ల ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా లబ్ధిదారుల ఇంటికి రేషన్ బియ్యం అందించే ఏర్పాట్లు చేసినా అక్రమాలు ఆగడం లేదు. కొందరు డీల్లర్లతో నేరుగా సంబందం పెట్టుకొని రేషన్ బియ్యం స్వాహా చేస్తున్నారు.

డోన్ మండలంలోని ఉంగరాణిగుండ్ల గ్రామ సమీపంలో ఓ వ్యాపారి నుంచి అధికారులు భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గోదాంలో నిల్వ ఉంచిన సుమారు 350 బస్తాల రేషన్ బియ్యం సీజ్ చేశారు. ఇక నిత్యం డోన్ నియోజకవర్గం నుంచి వాహనాలలో రేషన్ బియ్యం తరలిపోతూనే ఉన్నాయి. అధికారుల దాడులలో ఈ తరలింపు వ్యవహారం బయటపడుతూనే ఉన్నాయి.

ఇక పోలీసులు, రెవిన్యూ, విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం చూసి చూడనట్టు వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ రేషన్ బియ్యం మాఫియా జోరుకు కళ్లెం వేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News