Pulichintala Dam: 16వ గేట్ వద్ద కొనసాగుతున్న మరమ్మతు పనులు
* ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం * పులిచింతల డ్యామ్ కనిష్ట స్థాయికి చేరుకున్న నీటిమట్టం
పులిచింతల ప్రాజెక్టు (ఫైల్ ఫోటో)
Pulichintala Dam: పులిచింతల డ్యాంలో విరిగిన గేటుకు మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా రావడంతో పనులకు ఆటంకం కలిగింది. జలాశయంలో నీటిమట్టం తగ్గితేనే గేటును అమర్చేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులోని 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరోవైపు సాగుకు ఉపయోగించుకోవాల్సిన నీరంతా కడలిపాలవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కనిష్ట స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ప్రస్తుతం 5.28 టీఎంసీలకు పులిచింతల నీటిమట్టం చేరుకోవడంతో తక్షణమే విరిగిన గేట్ స్థానంలో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రానికల్లా స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పనులు విజయవంతంగా పూర్తయితే.. పులిచింతల నుంచి రెండు రోజులుగా వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని నిలిపివేసే అవకాశం ఉంది. తిరిగి సాగర్ నుంచి నీటితో పులిచింతల జలాశయం నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇప్పటికే స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేయడంలో నిపుణులు, అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. విరిగిన గేటు మరమ్మతులకు గాంట్రీ క్రేన్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. స్టాప్‌లాక్ ఏర్పాటు కోసం అవసరమైన ఇనుప దిమ్మెలను సిద్ధం చేశారు. ఒక్కో ఇనుప దిమ్మె బరువు 12 టన్నులకు పైగా ఉంటుంది. ఇలాంటి 11 దిమ్మెలను ఒక దానిపై ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఇనుప దిమ్మె ఏర్పాటు చేసేందుకు సుమారు గంట సమయం పడుతుంది. సాధ్యమైనంత వరకు శనివారం సాయంత్రానికి పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.