Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా పవన్.. అసలు కారణం ఏంటి..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Update: 2025-02-05 10:44 GMT

ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా పవన్.. అసలు కారణం ఏంటి..?

Delhi Assembly Elections: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ పాల్గొంటారనే టాక్ వినిపించింది. కానీ పవన్ ప్రచారానికి వెళ్లలేదు. ఇవాళ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో పవన్ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదా అనే చర్చ మొదలైంది.

మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ వస్తున్న బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఢిల్లీలో పాగా వేయాలని బీజేపి గట్టిగా ప్రయత్నిస్తూ వస్తోంది. అందుకే ఎన్నికల ప్రచారంలో అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన పలువురు నేతలు వెళ్లి ప్రచారం చేశారు. అయితే పవన్ కూడా ప్రచారం చేస్తారని ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా భావించారు. ఆఖరి నిమిషంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. కానీ పవన్ వెళ్లలేదు.

ఇటీవల పుంగనూరులో జరిగిన పార్టీ కార్యక్రమానికి కూడా పవన్ వెళ్లలేదు. నాగబాబు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఢిల్లీ ప్రచారానికి కూడా దూరంగా ఉండడంతో పవన్ కల్యాణ్ ఎందుకు ఎక్కడికీ వెళ్లడం లేదనే ప్రశ్న చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో చాలామందికి చాలారకాల సందేహాలు కలుగుతున్నాయి. పవన్ ఢిల్లీ ప్రచారానికి దూరంగా ఉండడానికి అసలు కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి.. పవన్ ప్రచారానికి దూరంగా ఉన్నారా? లేదంటే షూటింగ్ బిజీ వల్ల రాలేక పోయారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇక చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.... 2019లో మోడీని తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో కేజ్రీవాల్‌ను పొగిడారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే తమకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతోనే ఆయనను ప్రచారానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలున్నాయి. అలాంటి పవన్ కల్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News