On whom Amaravati Farmers are Angry: అమరావతి రైతుల అసలు కోపం ఎవరిపై?

Update: 2020-08-06 10:40 GMT

రాజధాని అమరావతి రైతులు ఆయనపై రగిలిపోతున్నారు. తమ భవిష‌్యత్తేంటని ఉడికిపోతున్నారు. ఎందుకిలా చేశారంటూ కళ్లెర్రజేస్తున్నారు. తమ దిక్కేంటని గుండెలు బాదుకుంటున్నారు. ఇంతకీ రాజధాని రైతుల ఆగ్రహం, ఆవేశం ఎవరిపై? సీఎం జగన్‌పైనా....మాజీ సీఎం చంద్రబాబుపైనా? ఎవరిపై, ఎందుకింత కోపమో తెలియ్యాలంటే, ఒక్కసారి ఈ కథనం చూడండి.

తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్నపుడు, ఆంధ్రా ప్రాంతంలో కనిపించిన పరిస్థితులే ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తథ్యమని తెలిసినా, నాటి సీమాంధ్ర ముఖ్యనేతలంతా విభజన జరిగే అవకాశమే లేదని బుకాయిస్తూ వచ్చారు. రాజీనామా డ్రామాలతో జనాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. నాటి కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నేతలకు చాలా స్పష్టంగా విభజన చేస్తున్నట్లు తేల్చి చెప్పినా, తమ రాజకీయ భవిష్యత్తు కోసం అలాంటిదేమీ ఉండబోదన్న అబద్ధాలు చెబుతూ పబ్బం గడిపే ప్రయత్నం చేశారు. కానీ తామొకటి తలిస్తే ఓటరు మరొకటి తలచినట్లు విభజన దెబ్బకు ముఖ్యనేతలంతా తమ రాజకీయ భవిష్యత్తును త్యాగం చెయ్యాల్సి వచ్చింది. కొంతమంది నేతలైతే ముందు చూపుతో పార్టీలు మారి బతుకుజీవుడా అని బయటపడ్డారు.

ఇదంతా గడచిన చరిత్ర ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చెయ్యాల్సి వస్తోందంటే, అమరావతి విషయంలోనూ అదే జరిగింది, జరుగుతోంది. రైతులకు, ముఖ్యంగా వారి భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటని అడిగే సమయమొచ్చింది. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడిన నేపథ్యంలో, ఇప్పుడు అమరావతి రైతుల భవిష్యత్తేంటన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. తమ భూముల్ని రాజధానికి ఇచ్చి అటు వ్యవసాయానికీ, ఇటు అభివృద్ధికీ దూరమైన తమ పరిస్థితేంటన్న ఆందోళన అటు రైతుల్లోనూ, వారిపై ఆధారపడ్డ ఇతర కుటుంబాల్లోనూ కనిపిస్తోంది. అంతా బాగుంటుందని కలలు కంటే చివరకు బతికుంటే చాలేమో అన్న భావనలోకి పరిస్థితులు వచ్చాయన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. చివరకు న్యాయస్థానాల్లో అయినా తమకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ, వారిని ఉగ్గబట్టుకుని ఎదురుచూసేలా చేస్తోంది.

అయితే చాలా బాగుంటాం అన్న స్థితి నుంచి బతికుంటే చాలన్న పరిస్థితులు తమకు దాపరించటానికి కారకులైన రాజకీయపార్టీల వ్యవహారశైలిపై, సదరు అమరావతి ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అమరావతికి జై కొట్టిన అధికార వైసీపీ, ఇప్పుడు రూటు మార్చి తమ బతుకులపై వేటేసిందని వారు భావిస్తున్నారు. వైసీపీ వస్తే తమ ఫ్యూచర్ బాగుంటుందని నమ్మి, అమరావతి ప్రాంతంలో మెజార్టీ భాగమైన తాడికొండ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే, వైసీపీ ఇలా చేసిందేమిటన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్యాకేజీని కానీ ఇతర హామీలను కానీ, ఏమీ ఇవ్వకుండా ఉన్నపళంగా ఈ రాజధాని తరలింపు వ్యవహారమేంటన్న సందేహమే ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తోంది. శాసనరాజధానిగా ఉండటం వల్ల తమకు కలిగే లబ్ధి ఏం లేదన్న అభిప్రాయమే, ఇప్పుడు అందరి నుంచి ధ్వనిస్తోంది.

అయితే ఇంకాస్త ఆసక్తికరమైన పరిణామాలు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని నమ్మి మంచి అడ్మినిస్ట్రేటర్ గా భావించి పూర్తిగా ఇష్టం లేకపోయినా తమ భూముల్ని నాటి సీఎం చంద్రబాబు చేతిలో పెడితే చివరకు ఆయనవల్ల కూడా తాము నష్టపోయామని అక్కడి రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నన్ను నమ్మండి, అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా మారుస్తానని చేసిన ప్రకటనలు కల్లలవుతాయని, అసలే ఊహించలేకపోయామని రైతులు మాట్లాడుకుంటున్నారు. ఐదేళ్లపాటు పవర్ లో ఉండి రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమని చంద్రబాబు చెప్పటం తమ జీవితాల్లో శాశ్వతంగా చీకట్లను నింపిందని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేసింది తప్పే కానీ, చేతిలో పవర్ ఉన్నపుడే చంద్రబాబు తమ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఇంతటి షాక్ తినాల్సిన అవసరమే ఉండేది కాదన్నది, వారి వాదనగా తెలుస్తోంది. జగన్ కు అవకాశం కల్పించిన బాబు తీరుపై, వారు మండిపడుతున్నారు.

మొత్తంగా ఐదేళ్లపాటు తమను మభ్యపెట్టే ప్రయత్నమే రాజధాని ప్రాంతంలో జరిగింది తప్ప, చివరకు తమకు మిగిలిందేంటన్న ఆవేదన ఇప్పుడు అమరావతి రైతుల్లో కనిపిస్తోంది. భవిష్యత్తుపై ఆవేదనతో కొంతమంది రైతుల గుండెలు కూడా ఆగుతున్నాయి. అధికారంలో ఉన్నపుడే ఇచ్చిన హామీల్ని అమలు చేసి ఉంటే, తమకు ఇప్పుడు ఈ గుండె కోతలు తప్పేవన్న వాదనే అక్కడ రింగుమంటోంది. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు చివరకు తమ భవిష్యత్తుకు సమాధి కట్టేస్తోందన్న భావన వారికి కంటిమీద కునుకురానీయటం లేదు. న్యాయస్థానాల్లో తమ పోరాటం ఫలిస్తుందన్న ఆశలు కూడా అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో, చివరకు తమకు మిగిలేదేంటన్న ప్రశ్న వారి నుంచి రీసౌండ్‌ ఇస్తోంది. ఫైనల్‌గా జగనన్న కొట్టిన దెబ్బ కంటే నాడు చంద్రన్న వేసిన దెబ్బే గట్టిగా తగిలిందన్న మాట అయితే రాజధానిలో బలంగా వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితులు మారతాయా...? స్థానిక ప్రజల ఆశలు నెరవేరతాయా...? ఎలాంటి భరోసాను ప్రభుత్వం ఇవ్వబోతోంది...? న్యాయస్థానాలు ఏం చెప్పబోతున్నాయి...? ఇవే ప్రశ్నలు అమరాతిలో ప్రతిధ్వనిస్తున్నాయి. మూడు ప్రాంతాలు బాగుండాలి..త్యాగాలు చేసిన రైతులు కూడా బాగుండాలన్నదే అందరూ కోరుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News