పవన్ ఓ రకంగా.. బీజేపీ మరో రకంగా.. అమరావతిపై అపుడే తేడా వచ్చేసిందా?

Update: 2020-01-21 13:24 GMT
Janasena Chief Pavan Kalyan (File Photo)

పట్టుమని పదిరోజులు కాలేదు. జనసేన.. బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళతామని చెప్పి. రెండు పార్టీలదీ ఒకేమాట.. ఇకనుంచి ఒకే బాట అంటూ ప్రకటించి రెండు వారాలు పూర్తి కాలేదు. బేషరతుగా తమతో కలసి ముందుకు వెళ్ళడానికి పవన్ ముందుకు వచ్చారు అంటూ బీజేపీ అప్పట్లో ప్రకటించింది. పవన్ కూడా బీజేపీ తో ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నామన్నారు. కానీ, ఇప్పుడు రెండు పార్టీల నుంచి వేరు వేరు అభిప్రాయలు వెలువడుతున్నాయి.

అలా చెబితేనే.. 

పవన్ కళ్యాణ్ అమరావతిని రాజధానిగా ఉంచుతామంటేనే తాము బీజీపీ తో కలవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. అయితే బీజేపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ్యుడు జీవీఎల్ నర్సింహం మాత్రం తాము ఆలా అనలేదనే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తీర్మానించినట్లు చెబుతూనే, రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని తెగేసి చెప్పారు.

రాజధానిలోని రైతులతో మంగళవారం భేటీ అయిన పవన్ కళ్యాణ్ అనంతరం మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. అసలు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామంటేనే కలుస్తామని బీజేపీకి కచ్చితంగా చెప్పమనీ, వారు ఒప్పుకున్నా తరువాతనే తాము ఆ పార్టీతో కలసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

''భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటే చెప్పాం.. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి మేం కట్టుబడి ఉన్నాం.. మీరు కట్టుబడి ఉన్నారా? అని.. దీనికి వారు చెప్పింది ఒక్కటే.. ప్రధాని ఇక్కడ శంకుస్థాపన చేశారు. దాన్ని మేం గౌరవిస్తాం. అమరావతిని ఇక్కడే ఉంచుతాం! ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందీ ఇవన్నీ మేం మాట్లాడటం లేదు'' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అలా అనేం లేదు.. 

ఇక మరోవైపు జీవీఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వ జోక్యమేమీ ఉండదని స్పష్టం చేశారు. ''రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ అంటోంది. అయితే ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉండదు. అయినా కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే .. తెలుగుదేశం పార్టీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?'' అంటూ ఎద్దేవా చేశారు.

ఢిల్లీకి పవన్ కళ్యాణ్ 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ, జనసేనల మధ్య సమన్వయ కమిటీ సమావేశంలో అయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొంటారు. ఇప్పటికే అయన ఢిల్లీలో ఉన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటూ పొత్తుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. మిత్రపక్షాలుగా రాష్ట్రంలో ఎలా ముందుకు సాగాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. మరోవైపు జీవీఎల్ నరసింహం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  

Tags:    

Similar News