Tirumala: తిరుమల కొండపై ఎన్నికల ఎఫెక్ట్

Tirumala: గంటలోనే పూర్తవుతున్న గోవిందుని దర్శనం

Update: 2024-04-25 10:32 GMT

Tirumala: తిరుమల కొండపై ఎన్నికల ఎఫెక్ట్

Tirumala: తిరుమల కొండపై ఎన్నికల ఎఫెక్ట్ పడింది. వేసవి సెలవుల్లోనూ రద్దీ కనిపించకపోవడంతో.. గంటలోనే గోవిందుని దర్శనం పూర్తవుతుంది. ఎన్నికల కోడ్ కారణంగా రాజ్యాంగ హోదాలో స్వయంగా వచ్చిన వారికి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించి... సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కల్పిస్తోంది. ఎన్నికల నిబంధనలు అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

సాధారణంగా వేసవి సెలవులు మొదలయ్యే మార్చి చివరి వారం నుంచి జూలై నెల చివరి వరకు తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తిరుమల కిక్కిరిసి పోతుంటుంది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో చాలామంది తిరుమల పర్యటన వాయిదా వేసుకుంటున్నారు. చాలా మంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో కొంత మంది, ఎన్నికల నిబంధనలు అమలులో ఉండటంతో ప్రయాణాలు ఎందుకని మరికొంతమంది వాయిదా వేసుకుంటున్న క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత 20 రోజులుగా తగ్గింది.

గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 16 లక్షల 51 వేల 341 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు 15 లక్షల మంది భక్తులే శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో శ్రీవారిని సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే 90 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. కానీ 10 రోజులుగా సగటున 60 వేలమంది మాత్రమే దర్శించుకున్నారు. సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని షెడ్లలో నిలబడే అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ నడుస్తోంది. సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పటికీ రద్దీ కనిపించడం లేదు. గంట నుంచి రెండు గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. పోలింగు సమీపిస్తున్న క్రమంలో తిరుమలలో రద్దీ ఇంకా తగ్గే అవకాశముందని టీటీడీ ఆలయ అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News