Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 2 తుఫాన్లు.. 3 అల్పపీడనాలు..!!

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 2 తుఫాన్లు.. 3 అల్పపీడనాలు..!!

Update: 2026-01-17 01:59 GMT

Weather Update: ఇవాళ ముక్కనుమ కావడంతో పండుగ సెలవులు ముగించుకుని చాలామంది రాత్రికి తమ సొంత ఊర్ల నుంచి తిరిగి నగరాల వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణం ఎలా ఉంటుందన్నది ప్రయాణికులకు ముఖ్యమైన అంశం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తే, ప్రయాణాలకు అనుకూలంగానే ఉంటాయి. అయితే చలి మాత్రం కాస్త ఎక్కువగానే ఉండే సూచనలు ఉన్నాయి.

ఈ సమయంలో హిందూ మహా సముద్రంలో ‘దూద్‌జాయ్’ అనే అతి తీవ్ర తుపాను కొనసాగుతోంది. ఈ తుపాను గంటకు సుమారు 205 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ అత్యంత శక్తివంతంగా మారింది. 2025 సంవత్సరంలో హిందూ మహా సముద్రంలో ఇంత బలమైన తుపాను ఏర్పడటం ఇదే తొలిసారి. అయితే ఊరట కలిగించే విషయం ఏమిటంటే, ఈ తుపాను దక్షిణ దిశగా కదులుతోంది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు దూరంగా ప్రయాణిస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రత్యక్ష ప్రభావం ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, భూమధ్య రేఖా ప్రాంతంలో మరో మూడు అల్పపీడనాలు ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అవి ప్రస్తుతం తుపానులుగా మారే పరిస్థితి లేకపోయినా, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న సంకేతాన్ని ఇవి ఇస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ ఆసియాలో ‘నొకాయెన్’ అనే తుపాను ఫిలిప్పీన్స్ సమీపంలో ఉంది. దీని గాలి వేగం గంటకు సుమారు 85 కిలోమీటర్లు ఉండటంతో, ఇది ఇటీవల మనకు ఎదురైన మొంథా తుపాను స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. చలికాలంలో ఈ స్థాయిలో తుపాన్లు, అల్పపీడనాలు ఏర్పడటం వాతావరణ మార్పులకు ప్రమాదకర సంకేతంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, భోగి మంటల ప్రభావంతో కొద్దిగా వేడి పెరిగింది. అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో, రాబోయే ఆరు నెలల పాటు ఉత్తరార్థ గోళంపై ఎక్కువ సూర్యకాంతి పడనుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే చలి పూర్తిగా తగ్గిపోదు. ఇక నుంచి పగటిపూట కొంత వేడి, రాత్రివేళ చలి పెరుగుతూ ఉండే పరిస్థితి శివరాత్రి వరకూ కొనసాగవచ్చని అంచనా.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో మేఘావరణం లేకుండా పొడి వాతావరణం నెలకొంది. గాలులు తెలంగాణలో గంటకు సుమారు 9 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, రాత్రివేళ తెలంగాణలో 15 డిగ్రీలు, ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతున్నాయి. అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

తేమ శాతం కూడా గణనీయంగా తగ్గింది. పగటిపూట తెలంగాణలో తేమ 26 శాతం, ఏపీలో 48 శాతం మాత్రమే ఉంది. రాత్రివేళ తెలంగాణలో 59 శాతం, తీరప్రాంతం ప్రభావంతో ఏపీలో 91 శాతం వరకు తేమ నమోదవుతోంది. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ప్రయాణాలకు అనుకూల వాతావరణమే ఉండనుంది.

భారతదేశంలో వర్షాలు తగ్గినప్పటికీ, ఆగ్నేయ ఆసియా మరియు తూర్పు ఆసియా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటార్కిటికా నుంచి వచ్చే అతి చల్లని గాలులు, పెరుగుతున్న సూర్యకాంతి వల్ల సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి మేఘాల ఏర్పాటుకు దోహదపడుతున్నాయి. ఇవన్నీ కలిసి భూతాప సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి.

దూద్‌జాయ్ తుపాను కారణంగా భూమధ్య రేఖా ప్రాంతంలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ఇది బుధవారం వరకూ కొనసాగుతూ, ప్రస్తుతం మడగాస్కర్ వైపు కదులుతోంది. మంగళవారం నాటికి మడగాస్కర్ దక్షిణ భాగం వైపు వెళ్లి, ఆ తర్వాత దిశ మార్చుకుని అంటార్కిటికా వైపు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. అదృష్టవశాత్తూ ఇది మన రాష్ట్రాల వైపు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లే. అయితే సముద్రాల్లో ఏర్పడుతున్న ఈ విధమైన తుపాన్లు భవిష్యత్తులో భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News