Chandrababu: సంపాదనలో కొంత సమాజానికి ఇవ్వాలి.. పీ4 కార్యక్రమానికి పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు!

Chandrababu: ఆర్థిక అసమానతలు తొలగి, సామాజిక చైతన్యం పెరిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Update: 2026-01-30 09:48 GMT

Chandrababu: ఆర్థిక అసమానతలు తొలగి, సామాజిక చైతన్యం పెరిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో పూర్వ విద్యార్థుల భారీ విరాళంతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని (Maternal and Child Care Center) ఆయన ప్రారంభించారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సేవ:

ఈ భవన నిర్మాణానికి గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు సుమారు రూ. 100 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఇంతటి భారీ స్థాయిలో విరాళం అందడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి ప్రకారం కేవలం మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలని ఆకాంక్షించే ఇలాంటి వారు ఉండటం గర్వకారణమని ఆయన కొనియాడారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఉదాహరణగా చూపిస్తూ.. సాధారణ కుటుంబంలో జన్మించినా ఆత్మవిశ్వాసంతో దేశ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చించాలని, ప్రతి ఒక్కరూ 'పీ4' (Public Private People Partnership) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ కేంద్రం వల్ల పేద మహిళలకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.

Tags:    

Similar News