AP Free Electricity for Weavers: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం షురూ.. పూర్తి వివరాలు ఇవే!
Free Power Scheme In Ap: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది.
Free Power Scheme In Ap: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వివరాలను వెల్లడించారు.
ఉచిత విద్యుత్ పథకం ముఖ్యాంశాలు: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకం అమలులోకి రానుంది. దీని ద్వారా దాదాపు లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
చేనేత మగ్గాలు: ప్రతి మగ్గానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీనివల్ల 93,000 కుటుంబాలకు నెలకు రూ.720 (ఏడాదికి రూ.8,640) ఆదా అవుతుంది.
మర మగ్గాలు (Powerlooms): ప్రతి మరమగ్గానికి నెలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. దీనివల్ల 10,534 కుటుంబాలకు నెలకు రూ.1,800 (ఏడాదికి రూ.21,600) మేర ఆర్థిక ఊరట కలుగుతుంది.
ఈ పథకం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.85 కోట్ల అదనపు భారం పడనుంది.
నేతన్నలకు పెన్షన్ భరోసా: 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,280 మంది నేతన్నలకు ఈ పెన్షన్ అందుతోంది. పెంచిన వెయ్యి రూపాయల వల్ల ప్రతి కార్మికుడికి ఏడాదికి రూ.12 వేల అదనపు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.
మౌలిక సదుపాయాలు - టెక్స్‌టైల్ పార్కులు: రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది:
విశాఖపట్నం: రూ.172 కోట్లతో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ నిర్మాణం.
మెగా పార్కులు: మంగళగిరిలో మెగా టెక్స్‌టైల్ పార్కు, ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్.
టెక్స్‌టైల్ హబ్‌లు: ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడి ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు.
పిఠాపురం: ఇక్కడ కొత్తగా మెగా క్లస్టర్ నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఆర్థిక చేయూత మరియు ఉపాధి: నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించే లక్ష్యంతో టాటా తనేరియా, బిర్లా ఆద్యం వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆప్కో ద్వారా ఇప్పటికే రూ.7 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు, నూలుపై 15 శాతం రాయితీని అందిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఏపీ చేనేత రంగానికి గోల్డ్ మెడల్ రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.