Chandrababu Naidu fire on Minister TG Bharath: దావోస్ పర్యటనలో ఏపీ ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటూ మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సమావేశం తర్వాత భరత్‌ను చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఎప్పుడు, ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మనం ఇక్కడికి ఎందుకొచ్చాం.. మీరు ఏం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి గానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ చురకలు అంటించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయని టాక్.
సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారులు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు టీడీపీ నేతలు, లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తే.. మంత్రి మాత్రం ఏకంగా లోకేష్‌ను సీఎం చేయాలంటూ చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం పదవి అంశంపై కూటమిలో చర్చ జరుగుతున్న వేళ ఏకంగా సీఎం చేయాలనడం మరింత కాకపుట్టిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం జనవరి 20వ తేదీనే స్పందించింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. ఎవరూ మీడియా దగ్గర బహిరంగ ప్రకటనలు చేయొద్దని హెచ్చరించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని అధిష్టానం నేతలకు సూచించింది. మరోసారి ఈ తప్పు జరగకూడదని హెచ్చరించింది.
టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది నేతల్లో మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాలకు వెళ్లినా ఇదే తీరు కనబరచడంతో సీఎం చంద్రబాబు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా నేతల తీరు మారుతుందా? లేదా అనేది చూడాలి. మొత్తానికి లోకేష్ డిప్యూటీ సీఎం, సీఎం అంటూ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఏపీ కూటమిలో హాట్ టాపిక్‌గా మారాయని చెప్పొచ్చు.