అమిత్‌ షాతో భేటీలో కీలక అంశాలను ప్రస్తావించిన YS Jagan

Update: 2020-02-15 05:06 GMT
అమిత్‌ షాతో భేటీలో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం జగన్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు అర గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అమిత్‌ షాతో భేటీ అయి సుమారు 40 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌తో రూ.838 కోట్లు ఆదా చేసినట్లు జగన్ అమిత్‌షాకు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో పోలవరం నిర్మాణం వేగంగా సాగుతోందని 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని జగన్ చెప్పారు. ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను చేపట్టాల్సి ఉందని జగన్ అన్నారు.

అయితే, 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ప్రాజెక్టు రివైజ్డ్‌ అంచనాలను రూ.55,549 కోట్లుగా ఆమోదించిందని జగన్ చెప్పారు. పరిపాలనాపరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని త్వరగా పరిష్కరించాల్సిందిగా అమిత్‌ షాను సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.3,320 కోట్లు రావాల్సి ఉందని, ఆ నిధులు ఇప్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షా భేటీలో సీఎం జగన్ కోరారు.

Tags:    

Similar News