జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష
భోజన విరామం అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న జిల్లా కలెక్టర్ల సదస్సులో శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు సమీక్షించారు.
అమరావతి: భోజన విరామం అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న జిల్లా కలెక్టర్ల సదస్సులో శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు సమీక్షించారు. వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని, ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని, కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదన్నారు. తిరుపతి లాంటి నగరాల్లో ఈ సమస్య ఉందని, లబ్దిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలని చెప్పారు.
ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి, త్వరితగతిన పరిష్కరించమని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలన్నారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీకి వస్తానని చెప్పారు. జీరో టాలరెన్సు విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందేనని, గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్టేనని, విభాగాల వారీగా గ్రీవెన్సులపై విశ్లేషణ చేస్తానని చెప్పారు.
మురుగు కాలువలను శుభ్రపరచేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. మూడు నెలల్లోగా నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రపర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలని అన్నారు. నీటి భద్రత గురించి మాట్లాడుతుంటే తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండకూడదని, వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్సులు ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు.