AP News: మరో రెండు రోజుల్లో ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌

AP News: 10 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమైన బీజేపీ

Update: 2024-03-14 17:30 GMT

AP News: మరో రెండు రోజుల్లో ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌

AP News: ఏపీలో బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తుల్లో భాగంగా 10 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. ఆ నియోజకవర్గాలు ఏంటి? అక్కడి అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. నియోజకవర్గాల జాబితాను అధిష్ఠానం గోప్యంగా ఉంచుతోంది. అయితే బయటకు వెల్లడించకపోయినా.. లోలోపల నియోజకవర్గాలు, అభ్యర్థుల విషయంలో మాత్రం గ్రౌండ్ వర్క్ పూర్తిచేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో విశాఖ నార్త్‌, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి.గన్నవరం, కైకలూరు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేట స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అనంతరం పురంధేశ్వరి 15 మంది అభ్యర్థుల జాబితాను ఆయనకు అందజేసినట్లు సమాచారం. ఉండవల్లిలోని చర్చల సారాంశాన్ని పార్టీ అగ్రనేతలైన జేపీ నడ్డా, అమిత్‌ షాలకు వివరించాకే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో జాబితా ప్రకటించేందుకు మరో రెండు లేదా మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి...

విశాఖ నార్త్ స్థానం నుంచి విష్ణుకుమార్‌ రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు తనకూ అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీ సీనియర్ నేత గారపాటి సీతారామాంజనేయ కూడా ఒక శాసనసభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అల్లుడు సాయిలోకేష్ రాజంపేట నుంచి బరిలో నిలిచే అవకాశం ఉంది.

లోక్‌సభ అభ్యర్థుల విషయానికొస్తే... రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి, తిరుపతి నుంచి మునీ సుబ్రహ్మణ్యం, నర్సాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీత పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ అభ్యర్థుల పేర్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో.. పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Tags:    

Similar News