Off The Record: టీడీపీలో వర్గపోరు..నేతలు పక్క చూపు చూస్తున్నారా?

Off The Record: పార్వతీపురం తెలుగుదేశం పార్టీలో వర్గ రాజకీయం రచ్చకెక్కింది. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది.

Update: 2026-04-11 01:29 GMT

Off The Record: టీడీపీలో వర్గపోరు..నేతలు పక్క చూపు చూస్తున్నారా?

Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుగా ఆధిపత్య పోరు కొనసాగుతోందట. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు బహిరంగ ఘర్షణలకు దారితీస్తున్నాయట. పార్టీలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు గత ఎన్నికల సమయానికే మొదలయ్యాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో విజయ్ చంద్రకు జగదీష్ వర్గం పూర్తి స్థాయిలో సహకరించలేదన్న ఆరోపణలు అప్పటినుంచే వినిపించాయి. ఆ తరువాత కూడా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గకపోగా మరింత పెరిగినట్టు తెలుస్తోంది.

తాజాగా పార్వతీపురం మండలం పిన్నింటి రామిరెడ్డి వలస గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం ఈ వర్గపోరును బయటపెట్టింది. జగదీష్ వర్గం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. ఆ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగదీష్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. ఎమ్మెల్యే విజయ్ చంద్ర వచ్చాకే అధికారికంగా కార్యక్రమం జరగాలని మరో వర్గం పట్టుపట్టింది. దీంతో రెండు వర్గాలు తలపడే పరిస్థితి ఏర్పడిందట. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈ వివాదంపై మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. గతంలో గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరినప్పుడు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అడ్డుకున్నారని జగదీష్ వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఈ విభేదాలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

 ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగదీష్ కుటుంబానికి సంబంధించిన భూములపై జరిగిన చర్యలు కూడా ఈ విభేదాలకు కారణమయ్యాయని సమాచారం. జగదీష్ అన్న డాక్టర్ రామ్మోహన్‌కు సంబంధించిన భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించడంలో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఈ వర్గపోరుకు కొత్త మలుపు తిప్పిందంటున్నారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగదీష్ తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం కూడా విజయ్ చంద్రకు అసంతృప్తిని కలిగించిందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. పార్టీ కేడర్ మధ్య కూడా విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరి వర్గాలు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో బలంగా వినిపిస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నదని స్థానిక నేతలు కూడా చెబుతున్నారు.

మరోవైపు జగదీష్‌కు సీనియర్ నాయకుడిగా పార్టీలో బలం ఉండటం, ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు మద్దతు ఉండటం ఆయనకు ప్లస్ అవుతోంది. అలాగే పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించడం కూడా ఆయన వర్గంలో ఉత్సాహాన్ని పెంచింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా తన సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే జగదీష్ సీనియర్ నాయకుడని, కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించినప్పటికీ, విభేదాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఏలాగైనా జగదీష్‌ను పార్టీ నుంచి బయటకు పంపాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

 ఇక విజయ్ చంద్ర, జగదీష్‌ మధ్య సాగుతున్న ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Full View


Tags:    

Similar News