Gold Scheme : తెలంగాణ ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. తులం బంగారం పథకంపై రేవంత్ సర్కార్ క్లారిటీ
Gold Scheme : తెలంగాణలో తులం బంగారం పథకం అమలుపై మంత్రి శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఐదేళ్లలోపు 100 శాతం నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు.
Gold Scheme
Gold Scheme : తెలంగాణలో ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం హామీపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అత్యంత ఆకర్షణీయమైన ఈ పథకం ఎప్పుడు అమలవుతుందా అని రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు, విపక్షాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వం తరపున కీలక ప్రకటన చేస్తూ, లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకాల్లో తులం బంగారం హామీ ఒకటి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ మాట ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఈ పథకంపై అడుగు ముందుకు పడకపోవడంతో విపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. తులం బంగారం ఏమైంది? అంటూ ఊరూరా నిలదీస్తున్నాయి. ఈ విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తులం బంగారం పథకం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. త్వరలోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అదనంగా తులం బంగారం పంపిణీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. "మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపు ప్రతి ఇంటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మెజార్టీ హామీలు అమలయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే కార్యరూపం దాల్చుతాయన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారెంటీల అమలుపై విసిరిన సవాల్‌కు శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. "బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు ప్రజలను పక్కదారి పట్టించే జిమ్మిక్కులు బాగా తెలుసు. మా అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అన్ని హామీలు నెరవేర్చాకే మేము మళ్లీ ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వెళ్తాము" అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం సమన్వయంతో పని చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆచరణ సాధ్యమైన పథకాలనే తాము మేనిఫెస్టోలో పెట్టామని, వాటిని అమలు చేసి తీరుతామని చెప్పారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటివి అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు తులం బంగారం పథకం కూడా త్వరలో పట్టాలెక్కనుండటంతో రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.