Vikarabad: పోలీసులకు 'స్ట్రెస్ మేనేజ్‌మెంట్' పాఠాలు!
Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది కోసం ఎస్పీ స్నేహ మెహ్రా ఐపిఎస్ ఆధ్వర్యంలో ఒత్తిడి నిర్వహణ సదస్సు నిర్వహించారు.
Vikarabad: పోలీసులకు 'స్ట్రెస్ మేనేజ్‌మెంట్' పాఠాలు!
Vikarabad: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహావీర్ కళాశాల ఆడిటోరియంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కోసం 'స్ట్రెంగ్త్నింగ్ మైండ్', 'స్ట్రెస్ మేనేజ్‌మెంట్' మరియు 'రెసిలెన్స్' అనే కీలక అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని నిపుణులు సూచించిన పలు అంశాలపై అవగాహన పొందారు.
ఈ వేదికపై జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సమాజ రక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ సిబ్బందికి మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే సరిపోదని, మానసిక స్థైర్యం (Resilience) కూడా ఎంతో అవసరమని ఆమె వివరించారు.
విధి నిర్వహణలో వచ్చే ఒత్తిడిని (Stress) అధిగమించి, వృత్తిపరమైన బాధ్యతలకు మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలనే విషయాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా, వారి వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు వ్యక్తిగత శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
అనంతరం ఈ సదస్సులో భాగంగా ప్రముఖ నిపుణులు ఆశిష్ చొహన్ మరియు నిదా ఫాతిమా హజరి గార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్లు నిర్వహించబడ్డాయి. ఆశిష్ చొహన్ గారు 'స్ట్రెంగ్త్నింగ్ మైండ్' అంశంపై మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో మనస్సును ఏకాగ్రతతో ఎలా ఉంచుకోవాలి, ప్రతికూల ఆలోచనలను అధిగమించి సానుకూల దృక్పథంతో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలను వివరించారు.
నిదా ఫాతిమా హజరి గారు 'రెసిలెన్స్' మరియు 'స్ట్రెస్ మేనేజ్‌మెంట్' పై అవగాహన కల్పిస్తూ.. నిత్యం ప్రజలతో మమేకమయ్యే పోలీస్ సిబ్బంది సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు దైనందిన జీవితంలో పాటించాల్సిన చిన్న చిన్న మార్పులు మరియు వ్యాయామాల గురించి ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ముగింపులో సిబ్బంది అడిగిన పలు సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, DCRB డీఎస్పీ జానయ్య, DTC డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏ ఆర్ డీఎస్పీ వీరేష్,సీఐ లు, ఎస్.ఐలు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.