Karimnagar: కార్మికుడికి అండగా మేయర్.. వైద్య ఖర్చులతో పాటు జీతం కూడా!
Karimnagar: విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురైన లైన్ మెన్ శివను పరామర్శించిన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్.
Karimnagar: కార్మికుడికి అండగా మేయర్.. వైద్య ఖర్చులతో పాటు జీతం కూడా!
కరీంనగర్: వీధి దీపాల నిర్వహణ విధుల్లో గత పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన లైన్ మెన్ శివను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మరోసారి పరామర్శించారు. కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించి. చికిత్స పొందుతున్న శివను, వారి తల్లిదండ్రులను ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా..
లైన్ మెన్ శివ ఆరోగ్య పరిస్థితి. గాయలకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ తో మేయర్ కొలగాని శ్రీనివాస్ చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరాన్ని బట్టి ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని వైద్యులకు సూచించారు. దీంతో వైద్యులు శివ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం గాయాలకు మెరుగైన చికిత్స చేశామని.. గాయాలు పూర్తిగా మానే వరకు చికిత్స అందిస్తామని మేయర్, కమీషనర్ కు తెలిపారు.
ఈ రోజు హాస్పిటల్ నుండి డి చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలుపడంతో.. చికిత్స ఖర్చులు డి చార్జ్ విషయం పై మేయర్ కొలగాని శ్రీనివాస్ డాక్టర్ తో చర్చించారు. హాస్పిటల్ వైద్య ఖర్చులను నగరపాలక సంస్థ ద్వారా చెల్లించడం జరుగుతుందని డాక్టర్ కు సూచించారు. అనంతరం బాధితుడి తల్లిదండ్రుల తో మేయర్ మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, శివ పూర్తి స్థాయిలో కుదుట పడే వరకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ..
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని పేర్కొన్నారు. శివ కోలుకునే వరకు మున్సిపల్ యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని, అతనికి రావలసిన సహాయ సహకారాలను త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి భారం కలగకుండా యథావిధిగా జీతం చెల్లిస్తామని. వైద్య ఖర్చులు అందిస్తామన్నారు.
నగరపాలక సంస్థ వీది దీపాల నిర్వాహాణ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శివ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమం లో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, చంద్రా మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.