టెండర్ల రద్దు ప్రకంపనలు.. మంత్రుల 'చీకటి ఒప్పందం'పై సిపిఐ ధ్వజం!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీన గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 50 కోట్ల టెండర్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ధర్నా నిర్వహించారు.

Update: 2026-03-28 11:06 GMT

టెండర్ల రద్దు ప్రకంపనలు.. మంత్రుల 'చీకటి ఒప్పందం'పై సిపిఐ ధ్వజం!

కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ లో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం 50 కోట్లు నిధులు మంజూరు చేసి, టెండర్లు కూడా పిలిచిందని, టెండర్లు ఆన్లైన్ లో వేశారని, వాటిని గుట్టు చప్పుడు కాకుండా మొన్న రాత్రి రద్దు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో చెప్పాలని, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. బల్దియాలో రద్దయిన టెండర్లను పునరుద్ధరించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయ ప్రధానగేటు ముందు ధర్నా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక కాకముందు ప్రభుత్వం విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు 50 కోట్ల నిధులను మంజూరు చేసిందని, వీటితో దాదాపు 87 అభివృద్ధి పనులను చేపట్టేందుకు గత సంవత్సరం సిడిఎంఏ పరిపాలన అనుమతి ఇచ్చిందని, కానీ కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం కమిషన్ల కోసం విలీనమైన గ్రామాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషన్ల కోసమే టెండర్లు రద్దు చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు..

ఈ ప్రక్రియలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కటై టెండర్లను రద్దు చేపించడం సిగ్గుచేటు అయిన చర్య అని కమీషన్ల కోసం తప్ప ప్రజల అభివృద్ధిపై మంత్రులకు పట్టింపు లేదని వారు విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చాం మా మార్క్ చూపిస్తామని కారు కూతలు కూసిన బండి సంజయ్ అవినీతికి ఆద్యం పోస్తున్నాడని చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ చొరవ తీసుకుని టెండర్ల రద్దు ప్రక్రియను వెనక్కు తీసుకోవాలన్నారు.

టెండర్ల రద్దు కోసం కాంగ్రెస్, బిజెపి కార్పొరేటర్లు సంతకాల సేకరణలు చేసి అధికారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంత దిగజారుడుతనానికి కాంగ్రెస్, బిజెపి పార్టీలు దిగడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లు చీకటి ఒప్పందం చేసుకొని విలీన గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజలు వీరిని విలీన గ్రామాల్లోకి వస్తే నిలదీయాలనికోరారు. కరీంనగర్ లో టెండర్లపై ఇంత వివాదం జరుగుతుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు.

టెండర్లను యధావిధిగా ఉంచి ఓపెన్ చేసి కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని మంత్రుల చీకటి ఒప్పందాన్ని విలీన గ్రామాల ప్రజలకు కరపత్రం ద్వారా తెలియజేస్తామని, విలీన గ్రామాల ప్రజలను ఆందోళనలకు సిద్ధం చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజులు హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్, నగర కార్యవర్గ సభ్యులు మామిడిపళ్లి హేమంత్, బాకం అంజన్న, కండే అజయ్, మార్క శ్రీనివాస్ గౌడ్, రమేష్, ఎల్లయ్య, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News