Sircilla: సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన ఉపాధి హామీపై సర్కార్‌కు చురకలు!
Sircilla: సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఉపాధి హామీ (VB-G RAM G) పథకం కింద నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.
Sircilla: సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన ఉపాధి హామీపై సర్కార్‌కు చురకలు!
కరీంనగర్: ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చినా, తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 92 వేల జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలు అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్తాబాద్ లో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అంకిరెడ్డిపల్లెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నా పార్లమెంట్ నియోజకవర్గంలో 32 కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లను నిర్మించినం. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేసినం అన్నారు.
బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం..
ఈసారి ( 2026-27) కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన VB-G RAM G పథకానికి 95 వేల 692 కోట్లను కేటాయించినం. గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ లో ఈ ఒక్క పథకానికే 40 శాతం నిధులు కేటాయించినం. మన తెలంగాణ విషయానికొస్తే. ఈ పథకం కింద 3 వేల కోట్లకుపైగా నిధులు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డ్ హోల్డర్లు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారు. ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినం. కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో విఫలమవుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోతున్నారు..
సిరిసిల్ల జిల్లాలో ఆశించిన స్థాయిలో పనిదినాలు కల్పించలేకపోతున్నారు. ఈ జిల్లాలో 92 వేల జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారు. 6 వేలలోపు కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరుతున్నా. ఈ పథకానికి అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం జాప్యం లేకుండా 40 శాతం నిధులను విడుదల చేయాలని కోరుతున్నా అన్నారు.