CP Sajjanar: పెట్రోల్ టెన్షన్ వద్దు.. హైదరాబాద్‌లో 60 రోజులకు సరిపడా నిల్వలు!
CP Sajjanar: గత కొన్ని రోజులుగా నగరంలో ఇంధన కొరత ఏర్పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
CP Sajjanar: పెట్రోల్ టెన్షన్ వద్దు.. హైదరాబాద్‌లో 60 రోజులకు సరిపడా నిల్వలు!
CP Sajjanar: గత కొన్ని రోజులుగా నగరంలో ఇంధన కొరత ఏర్పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పందిస్తూ.. నగరంలో ఇంధన కొరత ఉందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
60 రోజులకు సరిపడా నిల్వలు
నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 22న 3,024 KL ఇంధన విక్రయాలు జరగగా, వదంతుల కారణంగా 23వ తేదీ నాటికి అవి ఏకంగా 6,400 KLకి పెరిగాయి. ఒకేసారి ప్రజలందరూ బంకులకు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల ఏర్పడిన అత్యధిక డిమాండ్ కారణంగానే కొన్ని చోట్ల తాత్కాలికంగా 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.
ఇంధన సరఫరా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగుతోందని, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని సీపీ తెలిపారు. అయితే, బాటిళ్లు మరియు డబ్బాల్లో లూజ్ ఇంధనాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని సజ్జనర్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న 240 పెట్రోల్ బంకులపై పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు శాంతంగా ఉండాలని, అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించుకుని సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెంచవద్దని ఈ సందర్భంగా సీపీ విజ్ఞప్తి చేశారు.