Harish Rao: పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయి.. హైడ్రా కేవలం పేదల ఇళ్లపైకేనా?
Harish Rao: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసుల వ్యవహారంపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలలో ఎవరు అబద్ధం చెబుతున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.
Harish Rao: పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయి.. హైడ్రా కేవలం పేదల ఇళ్లపైకేనా?
రాష్ట్ర రాజకీయాల్లో 'బాంబులు' పేలుస్తానన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో పొంగులేటి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' చుట్టూ జరుగుతున్న వివాదాలను ఆయన ప్రస్తావించారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు గుర్తు చేశారు. "తమ కేబినెట్ మంత్రే కంపెనీలో అవినీతి జరుగుతోందని తమ అధికారులే గుర్తించారని సీఎం చెప్పారు. అనుమతులు లేకుండా నడుపుతున్నారని రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు సీఎం చెప్పింది తప్పా? లేక మంత్రి పొంగులేటి చెప్పింది తప్పా?" అని హరీశ్ రావు ప్రశ్నించారు. నాలుగు శాఖల అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా, ఆ మైన్ తనది కాదని అసెంబ్లీలో మంత్రి ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
మంత్రి పొంగులేటిని "పొంగులూటి" అని సంబోధిస్తూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. "రెండున్నరేళ్లుగా సదరు భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అది ప్రభుత్వ భూమి అని తెలిసినా హైడ్రా (HYDRA) ఎందుకు మౌనంగా ఉంది?" అని అడిగారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికే ఉందా? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న మంత్రి కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్‌పై స్పందిస్తూ.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చర్చకు సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. పొంగులేటి కంపెనీకి అధికారులు ఇచ్చిన నోటీసులే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి తన కంపెనీపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.