Srikakulam: పాతపట్నానికి పాలిటెక్నిక్ కళాశాల? సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి
Srikakulam: పాతపట్నం నియోజకవర్గ పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నివేదిక.
Srikakulam: పాతపట్నానికి పాలిటెక్నిక్ కళాశాల? సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి
పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దశాబ్దాల పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి పెట్టారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సమస్యల నివేదికను అందజేశారు. పాతపట్నం నియోజకవర్గంలో పలు గ్రామాలు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేలా సీది, కోసమల, మజ్జిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల) పథకాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
ప్రస్తుతం ఉన్న 50 పడకల పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. దీనివల్ల 75 గ్రామాలకు చెందిన సుమారు 90 వేల మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎంకు వివరించారు. నియోజకవర్గ యువతకు సాంకేతిక విద్యను అందించేందుకు కొత్తగా పాలిటెక్నిక్ మరియు ఐటిఐ (ITI) కళాశాలల ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇందుకోసం 3 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, 180 సీట్ల సామర్థ్యం గల పాలిటెక్నిక్ కళాశాల పాతపట్నం నియోజకవర్గానికి కావాలని ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యే పెండింగ్ లో ఉన్న పరిహారం, ఇళ్ల స్థలాల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని కోరారు. గతంలో నిర్వాసితులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
వంశధార రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. భగీరథపురం నుండి హిరమండలం ఎంపీడీవో ఆఫీస్ వరకు నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి విజ్ఞప్తి చేశారు. మెలియాపుట్టిలో ఐటిడిఏ (ITDA) కార్యకలాపాలను బలోపేతం చేసి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ అందజేసిన నివేదికపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి, ప్రాజెక్టులకు త్వరితగతిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియాకు తెలిపారు.