Yash Dayal-RCB: యశ్‌ దయాళ్‌కు ఆర్‌సీబీ బిగ్ షాక్‌!

Yash Dayal-RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు టీమిండియా బౌలర్ యశ్ దయాళ్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ భారీ షాక్ ఇచ్చింది.

Update: 2026-03-24 11:28 GMT

Yash Dayal-RCB: యశ్‌ దయాళ్‌కు ఆర్‌సీబీ బిగ్ షాక్‌!

Yash Dayal-RCB:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు టీమిండియా బౌలర్ యశ్ దయాళ్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2026 నుంచి దయాళ్‌ను తప్పించింది. ఈ సీజన్‌కు దయాళ్‌అందుబాటులో ఉండడం లేదని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బాబత్‌ అధికారికంగా వెల్లడించారు. దయాళ్‌ ప్రస్తుతం వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో జట్టుతో చేరడం అతడికి, జట్టుకు అనుకూలం కాదని ఆర్‌సీబీ మేనేజ్మెంట్ భావించినట్లు బోబాట్ తెలిపారు.

ఆర్‌సీబీ కాంట్రాక్ట్‌లోనే దయాళ్‌:

ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బాబత్‌ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నా. ఐపీఎల్ 2026 కోసం పేసర్ యశ్‌ దయాళ్‌ జట్టుతో చేరడం లేదు. అసలు విషయం ఏంటో మీ అందరికీ తెలుసు. దయాళ్‌ ప్రస్తుతం ఓ వ్యక్తిగత సమస్యతో బాధపడుతున్నాడు. మేము ఇప్పటి వరకు అతడికి మద్దతుగా ఉన్నాం. మేం దయాళ్‌ను రిటైన్‌ చేసుకోవడంలోనే ఆ విషయం అర్థమై ఉంటుంది. అతడు ఆర్‌సీబీ కాంట్రాక్ట్‌లోనే ఉన్నాడు. మేము క్రమం తప్పకుండా దయాళ్‌తో మాట్లాడుతున్నాం. ఈ రోజు ఉదయం కూడా నేను మాట్లాడాను. ఈ సమయంలో దయాళ్‌ ఆర్‌సీబీతో చేరడం అతడికి కానీ, ఫ్రాంచైజీకి కానీ మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని స్పష్టం చేశారు.

అత్యాచార ఆరోపణలు:

చివరిసారిగా యశ్ దయాళ్‌ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆడాడు. అనంతరం అతడిపై అత్యాచార ఆరోపణలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనపై ఐదేళ్లుగా దయాళ్‌ అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే.. మరో అమ్మాయి కూడా దయాళ్‌ తనను అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. సదరు యువతి వయసు 17 ఏళ్లే కావడంతో.. అతడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ రెండు అత్యాచార కేసుల కారణంగా అతన్ని ఉత్తరప్రదేశ్ జట్టుకు దూరం పెట్టింది. బెయిల్‌పై విడుదలైన యశ్ దయాళ్‌.. ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న నోయిడాలో శ్వేత పుండీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

దయాళ్‌ క్రికెట్ కెరీర్‌పై తాత్కాలిక ప్రభావం:

2025 సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన యశ్ దయాళ్‌ను 2026 కోసం ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఆ సీజన్‌లో 13 వికెట్లు తీసి జట్టుకు పెద్ద బలం అయ్యాడు. అయితే ఐపీఎల్ 2026కి ముందు ట్రైనింగ్ క్యాంప్‌కు అతను హాజరుకాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దయాళ్‌ ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు క్లారిటీ వచ్చింది. అత్యాచార కేసులు విచారణ దశలో ఉండడంతో అతని క్రికెట్ కెరీర్‌పై తాత్కాలిక ప్రభావం పడింది. ఈ ఆరోపణలు కోర్టులో పరిశీలనలో ఉండగా.. తుది తీర్పు వెలువడాల్సి ఉంది. దయాళ్‌ లాంటి ఎడమచేతి పేసర్ లేకపోవడం ఆర్‌సీబీ బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషారా, జాకబ్ డఫీ వంటి బౌలర్లు ఇప్పుడు మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News