Rajasthan Royals: ఐపీఎల్‌ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?

ఐపీఎల్ చరిత్రలోనే కళ్లు చెదిరే భారీ డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రాంచైజీ చేతులు మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ జట్టును సొంతం చేసుకుంది.

Update: 2026-03-24 12:30 GMT

Rajasthan Royals: ఐపీఎల్‌ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?

Rajasthan Royals:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే కళ్లు చెదిరే భారీ డీల్ కుదిరింది. ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రాంచైజీ చేతులు మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ జట్టును సొంతం చేసుకుంది. 1.63 బిలియన్‌ డాలర్ల (రూ.15 వేల కోట్లు)తో ఆర్ఆర్ ఫ్రాంచైజీని కన్సార్టియం దక్కించుకుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. త్వరలోనే ఈ భారీ డీల్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఒప్పందంపై సంతకాలు:

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కన్సార్టియం మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని, 2026 ఐపీఎల్‌ తర్వాత కొత్త యజమానులకు ఈ ఫ్రాంచైజీ అప్పగించనున్నారని తెలుస్తోంది. కల్ సోమాని నేతృత్వంలోని ఈ కన్సార్టియానికి అమెరికా వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ (వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన వ్యక్తి), అలాగే డెట్రాయిట్ లయన్స్ (ఎన్‌ఎఫ్‌ఎల్ జట్టు)లో ప్రధాన వాటాలు కలిగిన హ్యాంప్ కుటుంబం కూడా ఈ డీల్‌లో భాగం. ఫోర్డ్ మోటార్ కంపెనీలో కీలక వాటాలు కలిగిన షీలా ఫోర్డ్ హ్యాంప్ కూడా ఈ పెట్టుబడిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో ఈ డీల్ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీసింది.

టెక్నాలజీ రంగంలో సోమాని తన ముద్ర:

కల్ సోమాని టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన ఇన్‌ట్రాఎడ్జ్, ట్రుయో, ట్రుయో.ఏఐ, అకాడెమియన్ వంటి సంస్థలు ఎడ్‌టెక్, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ రంగాల్లో గ్లోబల్ స్థాయిలో ఎదిగాయి. టెక్నాలజీ రంగంలో తన ముద్ర వేసుకున్న సోమాని.. ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో కూడా అడుగుపెట్టారు. స్పోర్ట్స్ రంగంలో సోమాని ఆసక్తి మొదట స్పోర్ట్స్ టెక్నాలజీతో ప్రారంభమైనప్పటికీ.. తరువాత జట్ల యాజమాన్యానికి విస్తరించింది. ప్రస్తుతం ఆయన మోటర్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు కో-ఓనర్‌గా ఉన్నారు. అలాగే టైగర్ వుడ్స్, రోరీ మెక్‌ఇల్రాయ్ స్థాపించిన టీఎంఆర్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అండ్ టీజీఎల్ గోల్ఫ్ లీగ్‌లలో ప్రారంభ దశలోనే పెట్టుబడులు పెట్టారు.

ఆరు నెలలుగా చర్చలు:

గత ఆరు నెలలుగా రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత యాజమాన్యం జట్టును పూర్తిగా విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమాని కన్సార్టియం చేసిన భారీ ఆఫర్‌ను అంగీకరించి.. జట్టును విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2021లో రాజస్థాన్ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు సోమాని.. 'ఐపీఎల్‌లో భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుపై మాకు పూర్తి నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు. ఇప్పుడు పూర్తి యాజమాన్యాన్ని దక్కించుకోవడంతో రాజస్థాన్ జట్టు భవిష్యత్తుపై మరింత ఆసక్తి నెలకొంది. రాజస్థాన్‌ ఫ్రాంచైజీలో ఎమెర్జింగ్‌ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా.. రెడ్‌బర్డ్ క్యాపిటల్‌కు మిగతా వాటా ఉంది.

Tags:    

Similar News