Virat Kohli: ఇండియా టు లండన్‌కు ఛార్టర్డ్‌ ఫ్లైట్‌.. విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?

Virat Kohli:బెంగళూరు నుంచి లండన్‌కు నేరుగా స్పెషల్ ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేయాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌నువిరాట్ కోహ్లీ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు.

Update: 2026-03-23 07:16 GMT

Virat Kohli: ఇండియా టు లండన్‌కు ఛార్టర్డ్‌ ఫ్లైట్‌.. విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?

Virat Kohli: భారత స్టార్ ఆటగాడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో లండన్‌లోనే ఎక్కువగా ఉంటున్నాడు. మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే భారత్ వస్తున్నాడు. భారత్ తరఫున కేవలం వన్డేల్లోనే ఆడుతోన్న కింగ్.. తాజాగా ఐపీఎల్‌ 2026 కోసం బెంగళూరు చేరుకున్నాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) క్యాంపులో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. అయితే కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎదుట చాలా డిమాండ్లు పెట్టాడన్న రూమర్స్ వైరల్‌గా మారాయి. అందులో ముఖ్యంగా మ్యాచ్‌కు మధ్య మూడు రోజుల గ్యాప్ ఉంటే.. బెంగళూరు నుంచి లండన్‌కు నేరుగా స్పెషల్ ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేయాలని మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారంపై విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. తనపై వచ్చిన రూమర్లపై ఒక్క పోస్టుతో సమాధానం ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు. ఈ వార్తలు పూర్తిగా అబద్ధమని, ఎలాంటి డిమాండ్లు తాను చేయలేదని స్పష్టం చేశాడు. కోహ్లీ రియాక్షన్ సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయింది. కోహ్లీ స్పందనతో అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2026కి ముందు ఇలాంటి తప్పుడు ప్రచారాలు రావడం మరోసారి సోషల్ మీడియా బాధ్యతపై చర్చకు దారి తీసింది.

'ఐపీఎల్‌ 2026కు విరాట్ కోహ్లీ భారీ డిమాండ్లతో వచ్చాడు. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఇండియా టు లండన్‌కు ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ అనుమతి ఇవ్వాలి. మ్యాచ్‌లకు మూడు రోజుల వ్యవధి ఉంటే లండన్‌కు పంపించాలి. తదుపరి మ్యాచ్‌కు ఓ రోజు ముందు మాత్రమే జట్టుతో కలుస్తా' అని విరాట్ కోహ్లీ తన ఫొటో ఉన్న పోస్టుపై నవ్వుతూ ఉన్న రెండు ఎమోజీలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో కోహ్లీపై వచ్చినవన్నీ తప్పుడు వార్తలే అని స్పష్టమైంది.

'ఐపీఎల్‌ 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. గత సీజన్‌లో టైటిల్ గెలిచిన బెంగళూరు.. ఈసారి కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌లలో 8,661 రన్స్ చేశాడు. ఇందులో 8 శతకాలు, 63 అర్ధ శతకాలున్నాయి. ఈ సీజన్‌లో 9,000 పరుగుల మైలురాయిని అందుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News