పది నిమిషాల్లోనే తల నొప్పి.. వైభవ్ సూర్యవంశీ గురించి ఈ షాకింగ్ విషయం తెలుసా?

Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi’s Headache Story. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి అతడి కోచ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

Update: 2026-06-25 13:21 GMT

పది నిమిషాల్లోనే తల నొప్పి.. వైభవ్ సూర్యవంశీ గురించి ఈ షాకింగ్ విషయం తెలుసా?

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్లేయర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన ఈ యువ ఆటగాడు.. ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుది జట్టులో చోటు దక్కితే.. భారత జట్టు తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ రికార్డు ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉంది.

ఎన్నో త్యాగాలు, మరెన్నో కష్టాలు:

అయితే వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో త్యాగాలు, కష్టాలు, కుటుంబ సభ్యుల అంకితభావం ఉన్నాయి. ముఖ్యంగా అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కలలే వైభవ్ ప్రయాణానికి పునాది అయ్యాయి. బీహార్‌లోని మోతీపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ క్లబ్ స్థాయి క్రికెటర్‌గా రాణించినప్పటికీ.. తన కలను నెరవేర్చుకోలేకపోయాడు.

తన కుమారుడిలో అసాధారణ ప్రతిభను కోచ్‌లు గుర్తించడంతో.. వైభవ్ కోసం తన సమయం, సంపాదన, శక్తి అన్నీ అంకితం చేశాడు. వైభవ్ తొలి కోచ్ బ్రజేష్ ఝా అతని ప్రతిభను గుర్తించిన తొలి వ్యక్తి. చిన్న వయసులోనే పెద్ద పిల్లలతో కలిసి ప్రాక్టీస్‌కు వచ్చిన వైభవ్.. చెప్పిన ప్రతి విషయాన్ని వెంటనే నేర్చుకునేవాడని గుర్తు చేసుకున్నారు.

'స్టాన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా పరుగెత్తాలి, ఎలా షాట్ ఆడాలి అన్నది ఒక్కసారి చెబితే చాలు వెంటనే అమలు చేసేవాడు. చిన్న వయసులోనే అతడిలో ప్రత్యేకమైన నేర్చుకునే తత్వం కనిపించింది' అని బ్రజేష్ ఝా తెలిపారు.

సార్.. తల నొప్పిగా ఉంది:

పాట్నాలో జరిగిన ట్రయల్స్ సమయంలో వైభవ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. సమస్తిపూర్ నుంచి వచ్చిన ఓ చిన్న లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అసాధారణ ప్రతిభ చూపిస్తున్నాడని అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. దాంతో ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే బీహార్ అండర్-17 జట్టులో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వైభవ్‌కు బ్యాటింగ్ అంటే చిన్నప్పటి నుంచే ప్రాణం. అతని మరో కోచ్ ఓజా మాట్లాడుతూ... 'ప్రాక్టీస్‌లో ఎంత కఠినమైన సెషన్లు పెట్టినా అతను సులభంగా అలవాటు పడేవాడు. అతని సామర్థ్యం అద్భుతం. అయితే ఫీల్డింగ్‌కు పంపితే పది నిమిషాల్లోనే వచ్చి 'సార్.. తల నొప్పిగా ఉంది' అనేవాడు. కానీ రాత్రంతా బ్యాటింగ్ చేయమంటే కూడా అలసిపోయానని ఒక్కసారి కూడా చెప్పలేదు' అని ఓజా నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

100 బంతులు ఆడి 30 పరుగులే:

ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదుతున్న వైభవ్.. చిన్నప్పుడు మాత్రం ఓపికతో ఇన్నింగ్స్ నిర్మించడం నేర్చుకున్నాడని కోచ్ బ్రజేష్ ఝా చెప్పారు. 'తొమ్మిదేళ్ల వయసులో ఒకసారి 100 బంతులు ఆడి కేవలం 30 పరుగులే చేశాడు. కానీ నేను చాలా సంతోషించాను.

ఎందుకంటే 100 బంతులు ఆడగలిగాడంటే అతనిలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని అర్థం. అప్పట్లో అతను తనకంటే రెండింతలు పెద్ద వయసున్న రాష్ట్ర స్థాయి బౌలర్లను ఎదుర్కొనేవాడు. శారీరక బలం తక్కువగా ఉండటంతో పరుగులు రాకపోయినా.. క్రీజులో నిలబడే గుణం మాత్రం అప్పుడే కనిపించింది' అని పేర్కొన్నారు.

సమస్తిపూర్ నుంచి పాట్నా వరకు సాగిన ప్రయాణం తర్వాత వైభవ్ కెరీర్ మారిపోయింది. 12 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేదికపై అడుగుపెట్టాడు. 2024 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. మొదట్లో చాలామంది దీనిని ప్రచార వ్యూహంగా భావించినప్పటికీ.. రాజస్థాన్ అతనిలోని అసలైన ప్రతిభను గుర్తించింది.

అరంగేట్రం దిశగా అడుగులు:

రాజస్థాన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2024లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్.. ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి అతని కెరీర్ మరింత వేగం అందుకుంది. దేశవాళీ టోర్నీలలో, ఇండియా ఏ, ఐపీఎల్ 2026లో అదరగొట్టాడు.

ఇప్పుడు ఏకంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా అరంగేట్రం దిశగా అడుగులు వేస్తున్న ఈ యువ సంచలనం.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరో పెద్ద స్టార్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News