RCB Next Captain: ఆర్‌సీబీకి తదుపరి కెప్టెన్ ఇతనేనా?.. భారీ హింట్ ఇచ్చిన ఫ్రాంచైజీ!

RCB Next Captain: RCB Jint on Next Captain. ఆర్‌సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబాట్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Update: 2026-06-25 13:28 GMT

RCB Next Captain: ఆర్‌సీబీకి తదుపరి కెప్టెన్ ఇతనేనా?.. భారీ హింట్ ఇచ్చిన ఫ్రాంచైజీ!

RCB Next Captain: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 464 పరుగులు చేసి జట్టు విజయాల్లో ప్రధాన భూమిక పోషించాడు. 168.72 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడిన అతడు పవర్‌ప్లే అనంతరం కూడా పరుగుల వేగం తగ్గకుండా ఆర్‌సీబీకి బలమైన స్కోర్లు అందించాడు.

కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పడిక్కల్.. తిరిగి బెంగళూరు జట్టులో చేరిన తర్వాత తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. బెంగళూరులోనే ఎక్కువ క్రికెట్ ఆడిన అతడు.. సొంత జట్టు తరఫున ఆత్మవిశ్వాసంతో ఆడుతూ తన సామర్థ్యాన్ని నిరూపించాడు. పడిక్కల్ ఆటతీరు మాత్రమే కాకుండా.. జట్టు కోసం నిస్వార్థంగా ఆడే తత్వం కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఆర్‌సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబాట్ మాట్లాడుతూ.. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అందించిన వేగాన్ని కొనసాగిచే బాధ్యను దేవదత్ పడిక్కల్‌కు అప్పగించామని తెలిపాడు. ఆ బాధ్యతను అతడు అద్భుతంగా నిర్వర్తించాడని ప్రశంసించాడు. 'పడిక్కల్ తన ఆటలో మరింత దూకుడు చూపించాలని మేము కోరాం. జట్టు అవసరాల కోసం అతడు పూర్తిగా తన ఆటతీరును మార్చుకున్నాడు. ఎంతో నిస్వార్థంగా బ్యాటింగ్ చేశాడు.

అతడి కృషికి పూర్తి క్రెడిట్ దక్కాలి' అని మో బొబాట్ పేర్కొన్నాడు. అయితే మో బొబాట్ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు ఆర్‌సీబీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పడిక్కల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ.. అతనిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. 'పడిక్కల్‌ వ్యక్తిత్వం నన్ను ఎంతో ఆకట్టుకుంది. అతడిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యే సామర్థ్యం అతనిలో ఉంది' అని చెప్పాడు. దీంతో రజత్ పాటిదార్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు పడిక్కల్‌కు అప్పగించనుందని నెట్టింట చర్చ మొదలైంది.

ప్రస్తుతం రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్‌సీబీ దూసుకుపోతోంది. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అయినప్పటికీ పాటిదార్ కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన పడిక్కల్‌ను భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

కేవలం 25 ఏళ్ల వయసులోనే ఐదు సీజన్లకు పైగా ఆర్‌సీబీ తరఫున ఆడిన అనుభవం కూడా అతనికి కలిసిరానుంది. ఆర్‌సీబీ మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ కూడా పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 'జట్టులో స్థానిక ఆటగాడిగా బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక క్రికెటర్ పడిక్కల్. అతడు నిజమైన బెంగళూరు వ్యక్తి. చిన్న వయసులోనే మ్యాచ్ పరిస్థితులను అద్భుతంగా అర్థం చేసుకునే సామర్థ్యం అతనికి ఉంది' అని కార్తీక్ తెలిపాడు.

ఈ వ్యాఖ్యలతో దేవదత్ పడిక్కల్ కేవలం స్టార్ బ్యాటర్ మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఆర్‌సీబీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్రధాన అభ్యర్థిగా కూడా మారాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రజత్ పాటిదార్ సారథ్యంలో విజయవంతంగా దూసుకుపోతున్న ఆర్‌సీబీ.. రానున్న సంవత్సరాల్లో పడిక్కల్‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2-3 ఏళ్లు మాత్రం ఆర్‌సీబీ సారథిగా పాటిదార్ కొనసాగడం పక్కా. అప్పుడు కూడా మంచి ఫలితాలే వస్తే.. మరింత కాలం కొనసాగుతాడు.

Tags:    

Similar News