IND vs IRE: ఇండియన్ క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ టైమింగ్స్‌లో కీలక మార్పు!
IND vs IRE: India vs Ireland T20I series Timings. భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది.
IND vs IRE: ఇండియన్ క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ టైమింగ్స్‌లో కీలక మార్పు!
IND vs IRE: భారత క్రికెట్ జట్టు కొత్త టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో శుక్రవారం (జూన్ 26) నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. స్టోర్మాంట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. అందుకు కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. బుడ్డోడు అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడా లేదా అన్న అంశం అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో పాటు ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో బుడ్డోడి అరంగేట్రంపై చర్చ జరుగుతోంది.
టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలు:
అయితే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. అలాగే మూడో స్థానంలో ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో వైభవ్‌కు అవకాశం కల్పించడం అంత సులభంగా కనిపించడం లేదు. ఈ సిరీస్ శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా కీలక పరీక్ష కానుంది. డిసెంబర్ 2023 తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి వచ్చిన అయ్యర్.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేస్తూ జట్టును విజయవంతంగా నడిపించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అతనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉండటంతో భారత జట్టు దూకుడు ఆటను కొనసాగించాలని భావిస్తోంది.
హర్షిత్ రాణాకు అవకాశం ఇస్తారా?:
బౌలింగ్ విభాగంలో కూడా ఆసక్తికర పోటీ కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్‌కు తోడుగా గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణాకు అవకాశం ఇస్తారా? లేక ఇటీవల మెరుగైన ప్రదర్శనలు చేసిన ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్‌లకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఐర్లాండ్ జట్టు తీవ్ర గాయాల సమస్యతో సిరీస్‌కు సిద్ధమవుతోంది. అనుభవజ్ఞులైన పాల్ స్టిర్లింగ్, మార్క్ అడైర్, జోష్ లిటిల్ సహా పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కొత్త కెప్టెన్ లోర్కాన్ టక్కర్ యువ జట్టుతో భారత్‌కు సవాల్ విసరనున్నాడు. ఇప్పటివరకు భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. 8-0 ఆధిక్యంతో ఉన్న టీమిండియా ఈ సిరీస్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే నిలిచింది.
సాయంత్రం 6 గంటలకు మ్యాచ్:
ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. తొలుత నిర్ణయించిన సమయానికి బదులుగా భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లను గంట ముందుకు జరిపారు. దీంతో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. టాస్ సాయంత్రం 5:30 గంటలకే వేయనున్నారు. కావడం చాలా కాలం తర్వాత భారత పురుషుల జట్టు మ్యాచ్ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం అవుతోంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మ్యాచ్‌ల కారణంగానే ఈ మార్పు చేయాల్సి వచ్చింది. జూన్ 28న రాత్రి 7:00 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే సమయంలో ఉండకూడని బీసీసీఐ ఏఈ నిర్ణయం తీసుకుంది.
మ్యాచ్ వివరాలు:
మ్యాచ్: భారత్ vs ఐర్లాండ్ తొలి టీ20
తేదీ: జూన్ 26 (శుక్రవారం)
సమయం: సాయంత్రం 6:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
వేదిక: సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్, స్టోర్మాంట్
ప్రత్యక్ష ప్రసారం: సోనీ స్పోర్ట్స్ టెన్ ఛానల్స్
లైవ్ స్ట్రీమింగ్: సోనీలివ్ యాప్ మరియు వెబ్‌సైట్