'కింగ్' తిరిగొచ్చినప్పుడు.. 2 సెంచరీలు చేసిన ప్లేయర్ కూడా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సిందే!
Virat Kohli: AB de Villiers on Yashasvi Jaiswal ODI Snub. యశస్వి జైస్వాల్‌కు భారత వన్డే జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే.
'కింగ్' తిరిగొచ్చినప్పుడు.. 2 సెంచరీలు చేసిన ప్లేయర్ కూడా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సిందే!
Virat Kohli: యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు భారత వన్డే జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడంతో జైస్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. చివరి మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు బాదినా.. అతడిని బీసీసీఐ సెలెక్టర్లు పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ఈ నిర్ణయంపై దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ.. 'కింగ్' విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినపుడు ఎవరైనా తప్పుకోవాల్సిందే అని స్పష్టం చేశాడు.
ఏబీ డివిలియర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతో.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చిన యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. కోహ్లీ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన అతడు అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని సెంచరీతో మెరిశాడని ప్రశంసించాడు.
అయినప్పటికీ కోహ్లీ తిరిగి అందుబాటులోకి రావడంతో జైస్వాల్‌కు మళ్లీ చోటు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. 'జైస్వాల్‌కు ఇది కాస్త కఠినమైన పరిస్థితి. విరాట్ స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ అతడే జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.
కానీ ఇందులో ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదు. ఎందుకంటే కింగ్ తిరిగి వస్తున్నాడు. ప్రధాన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ వంటి ఆటగాడిని పక్కన పెట్టడం సాధ్యం కాదు' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న యువ ఓపెనర్.. సిరీస్ చివరి వన్డేలో 86 బంతుల్లో అజేయంగా 110 పరుగులు చేసి భారత జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
అయితే ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కోహ్లీని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. అయితే కింగ్ ఎంపిక ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఒకవేళ కోహ్లీ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే.. జైస్వాల్‌కు మరోసారి భారత జట్టులో అవకాశం లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్ భవిష్యత్తులో భారత వన్డే జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడు తిరిగి జట్టులోకి రావడంతో.. అతడు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోహ్లీ అనుభవం, స్థిరత్వం దృష్ట్యా సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సమంజసమేనని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడుతాడు. కప్ గెలిస్తే వెంటనే ఆటకు వీడ్కోలు చెబుతాడు. రోహిత్ శర్మ కూడా కోహ్లీ బాటలోనే నడవనున్నాడు. ఈ ఇద్దరు తప్పుకుంటే.. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది.