Team India Flaws: వైభవ్‌ను కాపాడే ప్రయత్నం.. భారత్ బలహీనతలు బట్టబయలు.. పరువు మొత్తం పోయిందిగా!
Team India Flaws: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Team India Flaws: వైభవ్‌ను కాపాడే ప్రయత్నం.. భారత్ బలహీనతలు బట్టబయలు.. పరువు మొత్తం పోయిందిగా!
Team India Flaws: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వకుండా బెంచ్‌కే పరిమితం చేయడంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో వైభవ్‌ను ఒత్తిడికి గురి చేయకూడదనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఐర్లాండ్‌పై ఆడించలేదని భావించినప్పటికీ.. అదే నిర్ణయం భారత జట్టు టాప్ ఆర్డర్‌లో ఉన్న అసలు బలహీనతలను బయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన వైభవ్:
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఐపీఎల్ అనంతరం ఇండియా-ఏ తరఫున కూడా మెరిశాడు. ఈ ప్రదర్శనతో బుడ్డోడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. అయితే ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్‌కు తుది జట్టులో అవకాశం లభించలేదు.
రక్షించాలనే ఆలోచన.. కానీ?:
ఐర్లాండ్‌లోని పచ్చిక వికెట్లు, మేఘావృత వాతావరణం, స్వింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో యువ ఆటగాడు వైభవ్‌ను నేరుగా బరిలోకి దింపితే అతడి ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఆ నిర్ణయం వల్ల భారత టాప్ ఆర్డర్‌లోని సీనియర్ ఆటగాళ్ల లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లపై జట్టు నమ్మకం ఉంచినా.. ఐర్లాండ్ పరిస్థితుల్లో వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. భారత ఉపఖండంలోని ఫ్లాట్ వికెట్లపై దూకుడుగా ఆడే వీరు.. స్వింగ్, సీమ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బంతి గాల్లోనూ, పిచ్‌పై పడిన తర్వాత కూడా కదలడంతో డిఫెండ్ చేయాల్సిన సమయంలో కూడా దూకుడుగా ఆడడం జట్టుపై ప్రభావం పడింది.
ఐపీఎల్ శైలి విదేశాల్లో పనిచేయలేదు:
ప్రస్తుతం భారత బ్యాటర్లలో పవర్ హిట్టింగ్ ఎక్కువగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విదేశీ పరిస్థితుల్లో ముఖ్యంగా బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కేవలం పవర్ హిట్టింగ్ సరిపోదు. బలమైన డిఫెన్స్, సాంకేతిక నైపుణ్యం, ఓర్పుతో ఇన్నింగ్స్‌ను నిర్మించే సామర్థ్యం కూడా అవసరమే. ఐర్లాండ్ సిరీస్‌లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం వల్ల కేవలం ఒక యువ ఆటగాడి అరంగేట్రం మాత్రమే ఆలస్యం కాలేదు.
విదేశీ పరిస్థితుల్లో భారత టాప్ ఆర్డర్ ఎంతవరకు సవాళ్లను ఎదుర్కోగలదనే ప్రశ్న కూడా తలెత్తింది. ఐర్లాండ్ వంటి జట్టుపై కూడా స్వింగ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే.. భవిష్యత్తులో మరింత బలమైన జట్లపై భారత్‌కు కఠిన పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న అసలు సవాలు వైభవ్‌ను ఎలా వినియోగించాలన్నది కాదు.. విదేశీ పరిస్థితుల్లో టాప్ ఆర్డర్‌ను ఎలా బలోపేతం చేయాలన్నదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.