Gautam Gambhir Trolls: కోచ్‌గా గంభీర్‌ మాకొద్దు బాబోయ్.. ఐస్‌లాండ్‌ క్రికెట్ ఎగతాళి!

Gautam Gambhir Trolls: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-06-29 12:44 GMT

Gautam Gambhir Trolls: కోచ్‌గా గంభీర్‌ మాకొద్దు బాబోయ్.. ఐస్‌లాండ్‌ క్రికెట్ ఎగతాళి!

Gautam Gambhir Trolls: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురైంది. పసికూన ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. దాంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అత్యంత బలమైన జట్టుగా బరిలోకి దిగిన భారత్.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్‌కు కెప్టెన్సీ ఇవ్వడం దగ్గర నుంచి, గంభీర్ తీసుకున్న ఆటగాళ్ల ఎంపిక నిర్ణయాల వరకు ప్రతి ఒక్కటి ఇప్పుడు విమర్శకులకు కారణమయ్యాయి.

ఐస్‌లాండ్ క్రికెట్ ట్రోల్స్:

ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత్ ఇలా పసికూన చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే 'ఐస్‌లాండ్ క్రికెట్' బోర్డు గంభీర్‌పై ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 'గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకోవాలనే ఆలోచన మాకు లేదని ఇప్పుడే స్పష్టం చేస్తున్నాం. అయితే ఆయనకు అద్భుతమైన ప్రతిభ ఉంది. అంతటి స్టార్ భారత ఆటగాళ్లను పెట్టుకుని.. ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలు సాధించాలంటే నిజంగా అసాధారణమైన ప్రతిభ ఉండాలి' అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ఎద్దేవా చేసింది.

గంభీర్ వ్యూహాలను తప్పుబట్టిన సంజయ్ మంజ్రేకర్:

మరోవైపు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ విమర్శల కంటే కూడా కోచ్ గంభీర్ వ్యూహాత్మక లోపాలను విశ్లేషించారు. జట్టులో పార్ట్-టైమ్ ఆల్‌రౌండర్లను ఎక్కువగా చేర్చడం కంటే.. ఒక మంచి మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గతాన్ని గుర్తు చేస్తూ.. 'గతంలో ఆల్‌రౌండర్లు తక్కువగా ఉండేవారు. కానీ గంభీర్ హయాంలో మరీ ఎక్కువైపోయారు. భారత్‌కు అత్యవసరంగా ఒక స్పెషలిస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ కావాలి' అని మంజ్రేకర్ పోస్ట్ చేశారు.

సాంకేతికత కలిగిన బ్యాటర్లు అవసరం:

బ్రాడ్‌కాస్టర్ పోస్ట్-మ్యాచ్ షోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉండే ఫ్లాట్ పిచ్‌లపై ఆడే అలవాటున్న మన బ్యాటర్లు, బౌలింగ్‌కు అనుకూలించే విదేశీ పిచ్‌లపై బ్యాటింగ్ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి శుభ్‌మన్ గిల్ వంటి సాంకేతికత కలిగిన బ్యాటర్లు జట్టుకు అవసరమని సూచించారు. 'శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. నేను ఇక్కడ కెప్టెన్సీ గురించి మాట్లాడటం లేదు. విదేశీ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం అతనికి ఉంది. కాబట్టి ఇలాంటి కఠినమైన పిచ్‌లపై ఆడగలిగే సత్తా గిల్‌కు ఉంది. భవిష్యత్తులో అతడిని మళ్లీ టీ20ల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి:

ఐర్లాండ్ సిరీస్ భారత జట్టుకు నిరాశ కలిగించింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు. టీమిండియా పగ్గాలు చేపట్టిన మొదటి సిరీస్‌లోనే అతడికి షాక్ తగిలింది. ఐర్లాండ్ ముగియడంతో భారత్ ఇప్పుడు జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి సారించనుంది. అక్కడైనా శ్రేయాస్ సేన పుంజుకుంటుందో లేదో చూడాలి.


Tags:    

Similar News