India women Team: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినా.. భారత మహిళల జట్టుకు గుడ్‌న్యూస్!
India women Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ చేరడంలో విఫలమైన భారత మహిళల జట్టుకు ఊరట.
India women Team: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినా.. భారత మహిళల జట్టుకు గుడ్‌న్యూస్!
India women Team: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ చేరడంలో భారత మహిళల జట్టు విఫలమైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడి హర్మన్‌ప్రీత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెగా టోర్నీలో విఫలమైన భారత మహిళల జట్టుకు భారీ ఊరట దక్కింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028కు టీమిండియా అర్హత సాధించింది. క్రికెట్‌ను 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో తిరిగి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన కొత్త అర్హత విధానం ప్రకారం.. భారత్‌కు ఒలింపిక్ బెర్త్ ఖరారైంది.
ఆసియా నుంచి భారత్‌కే ఒలింపిక్ బెర్త్:
మహిళల విభాగంలో ఒలింపిక్ అర్హత కోసం ఐసీసీ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ప్రతి ఖండం నుంచి అగ్ర స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ సెమీఫైనల్‌కు చేరుకోకపోయినా.. టోర్నీలో పాల్గొన్న ఆసియా జట్లలో అత్యుత్తమ స్థానంలో నిలవడంతో ఆసియా ఖండానికి కేటాయించిన ఏకైక ఒలింపిక్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటికే నాలుగు జట్లు ఖరారు:
ఒలింపిక్స్ మహిళల టీ20 టోర్నీలో మొత్తం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇప్పటివరకు నాలుగు జట్లు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియా ఓషియానియా నుంచి, దక్షిణాఫ్రికా ఆఫ్రికా నుంచి, గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ యూరప్ నుంచి, భారత్ ఆసియా నుంచి నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ:
ఐదో బెర్త్ ఆతిథ్య దేశమైన అమెరికాకు దక్కే అవకాశం ఉంది. అయితే 2026 జూన్ 30 నుంచి డిసెంబర్ 31 మధ్య ఏదో ఒక సమయంలో ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-15లోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. 2027 మార్చి 1 నాటికి ర్యాంకింగ్స్‌లో ఉన్న అత్యుత్తమ అర్హ జట్టుకు ఆ స్థానం లభిస్తుంది. ఆరవ, చివరి ఒలింపిక్ బెర్త్ కోసం 2027లో జరిగే తొలి ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే అర్హత సాధించని అత్యుత్తమ ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొని చివరి టికెట్ కోసం పోటీపడతాయి.
వెస్టిండీస్‌కు ప్రత్యేక నిబంధన:
ఐసీసీ వెస్టిండీస్‌ను ఒకే సభ్య దేశంగా గుర్తించినా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాత్రం దానిని ఒకే జాతీయ ఒలింపిక్ కమిటీగా గుర్తించదు. అందువల్ల వెస్టిండీస్ ఒకే జట్టుగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. ఒకవేళ క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తే.. కరేబియన్ దేశాల మధ్య ప్రత్యేక టోర్నీ నిర్వహించి ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో పాల్గొనే దేశాన్ని ఎంపిక చేస్తారు.
ఒలింపిక్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?:
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో ప్రతి జట్టు 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ దశ అనంతరం టాప్-2 జట్లు స్వర్ణ పతక పోరులో తలపడతాయి. మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్య పతకం కోసం పోటీ పడతాయి. అన్ని క్రికెట్ మ్యాచ్‌లు అమెరికాలోని పోమోనా నగరంలో ప్రత్యేకంగా నిర్మించే వేదికలో నిర్వహించనున్నారు.